Saturday, May 28, 2011

Friday, May 20, 2011

నటుడు రజనీకాంత్‌ అనారోగ్యంలో అసలు రహస్యమేమిటి ?

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురించి తెలియని దేశంలోని సినీ ప్రియులు ఉండరు. హాంకాంగ్‌కు చెందిన స్టార్‌ హీరో జాకీ చాన్‌ తర్వాత ఆసియాలోనే సినిమాలకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న రెండవ హీరో ఆయన. ఫోర్బ్‌‌స మ్యాగజైన్‌ ఇటీవల ఆయనని 2010 సంవత్సరానికి చెందిన అత్యంత ప్రముఖులలో ఒకరిగా కీర్తించడం విశేషం. ఈ హీరో అకస్మాత్తుగా అనారోగ్యం పాలై చెనై్నలోని ఓ ఆసుపత్రిలో బుధవారం రాత్రి చేరారు. శ్వాస, జీర్ణాశయ సంబంధిత సమస్యలు ఏర్పడడంతో ఆయనను వెంటనే ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌లో చేర్పించారు. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రజనీ కాంత్‌ ఆరోగ్యం గురించి ఆయన సోదరుడు మాట్లాడుతూ మద్యాన్ని అకస్మాత్తుగా మానివేయడంతోనే ఆయనకీ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొనడం గమనార్హం.

ఒకవైపు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్‌ సినిమాలు సైతం చేసి దేశంలోని టాప్‌ హీరోలలో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు రజనీకాంత్‌. ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఈ స్టార్‌ హీరోకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. 61 సంవత్సరాల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అనారోగ్యంతో చెనై్నలోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో చేరారు. శ్వాస, జీర్ణాశయ సంబంధిత సమస్యలతో ఐసీ యూలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగైందని గురువారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రజనీకి గురువారం హీమోడయాలసిస్‌, అల్ట్రాఫిల్ట్రేషన్‌ నిర్వహిం చినట్టు ఆస్పత్రి హృద్రోగ విభాగం డీన్‌ డాక్టర్‌ తనికాలం పేర్కొన్నారు. జీర్ణాశయ సమస్యే ప్రధానంగా ఉందనీ, ఇతర అవయవాలన్నీ బాగున్నట్టు చెప్పారు. వైద్యానికి శరీరం పూర్తి గా సహకరిస్తోందనీ, ఆయన వేగంగా కోలుకుంటున్నట్టు తెలిపారు. ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి రాగానే ఐసీయూ నుంచి వార్డుకు ఆయనను తరలిస్తామని పేర్కొన్నారు.

ఆయన క్షేమమే...
రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితి క్రమ,క్రమంగా మెరుగవుతోందిని ఆయన సతీమణి లత పేర్కొన్నారు. ఐసీయూలో మెరుగైన వైద్యాన్ని అందించడానికి చేర్పించారే తప్ప ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అభిమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె వెల్లడించారు. తొందరగా కోలుకొని త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని పేర్కొన్నారు.

రెండు సార్లు ఆసుపత్రిలో...
గత నెల 29న రాణా సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత రజనీకాంత్‌ అనారోగ్యం పాలవ్వడంతో రెండుసార్లు ఆసుపత్రికి రావాల్సి వచ్చింది. మొదటిసారి కొన్ని వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకొని వెళ్లిన ఆయన రెండవసారి పూర్తి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇక రజనీ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన అభిమానులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాసిన ప్ల కార్డులతో వేలాదిమంది అభిమానులు ప్రతిరోజు ఆస్పత్రి వద్దకు వస్తున్నారు. దాదాపు ఆరువేల అభిమాన సంఘాలు రజనీకి ఉండడం విశేషం.

మద్యం మానివేయడంతోనే...
రజనీకాంత్‌ అస్వస్థత గురించి బెంగళూర్‌లో నివసించే ఆయన అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్‌ కొన్ని విష యాలు వెల్లడించారు. ‘ప్రస్తుతం ఊపిరితిత్తులు, కాలేయం ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రజనీ కొద్దిరోజుల క్రితం నుంచి మద్యాన్ని తీసుకోవడం మానివేశాడు. దీంతోనే ఆయనకీ అనారోగ్య సమస్యలు వచ్చాయి. రజనీకి న్యు మోనియా లేదా కిడ్నీల ఫెయిల్యూర్‌ అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం కిడ్నీలకు డయాలసిస్‌ చేయడం లేదు’ అని వెల్లడించారు. రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగి అయిన సత్యనారాయణ తమ్ముడు రజనీకాంత్‌తో చాలా సన్నిహితంగా ఉంటా రు. ప్రతిరోజు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటారు. ‘తమ్ముడు రజనీ అనారోగ్యం గురించి అభిమానులు పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏమీలేదు. మరో 15రోజుల పాటు ఆయన ఆసుప్రతిలో ఉంటూ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కు చికిత్సచేయించుకుంటారు. పూర్తిగా ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారు’ అని సత్యానారాయణ తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్‌ ఆరోగ్యం సీరియస్‌గా ఏమీ లేదని ఆయన చెప్పారు. ఇక సినీ రంగంలో దాదాపు అందరు నటులకు ప్రతిరోజు మద్యం తాగడం ఓ అలవాటు.

రజనీకాంత్‌ సైతం ప్రతిరోజు మ ద్యాన్ని తీసుకునేవారు. కానీ కొంతకాలం క్రితం ఆయన మద్యాన్ని అకస్మాత్తుగా మానివేశారు. దీంతో ఏర్పడిన సైడ్‌ ఎఫెక్ట్‌‌సలో భాగంగా ఆయనకు పలు రకాల ఇన్ఫెక్షన్‌లు సోకాయి. మద్యాన్ని అకస్మాత్తుగా మానివేయడంతో వాంతు లు కావడం, గ్యాస్ట్రో సమస్యలు, బలహీన పడడం, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ కారణంతోనే ఆయన మొదటిసారిగా గత నెల 29న ఆసుపత్రికి వచ్చారు. ఇక మెరుగైన వైద్యం కోసం రజనీకాంత్‌ను యుఎస్‌ఎకు పంపించాలన్న ఆలోచనేమీ లేదని రజనీకాంత్‌ సతీమణి లత, ఆయన సోదరు డు సత్యనారాయణ తెలిపారు. ఆరోగ్యం మెరుగై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత దాదాపు ఆరు నెలల వరకు ఆయన సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండవచ్చని వారు చెప్పారు. అయినప్పటికీ రజనీ కళ్ళెదుట కనిపిస్తే తప్ప ఫ్యాన్స్‌ మాత్రం శాంతపడేలా కనిపించడం లేదు.

నాటకాల్లో...
రజనీకాంత్‌ మొదట పాపులర్‌ కన్నడ నాటకాల రచయిత, దర్శకులు టోపి మునియప్ప వద్ద నటనలో శిక్షణపొందారు. ఆయన నాటకాల్లో పలు పాత్రల్లో నటించారు. 1973లో ఆయనతో కలిసి నాటకాలు చేసిన రాజ్‌ బహదూర్‌ అనే స్నేహితుడు రజనీకాంత్‌ను మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణపొందాలని సూచించారు. దీంతో ఈ ఇనిస్టిట్యూట్‌లో చేరిన రజనీకాంత్‌కు రెండు సంవత్సరాల పాటు అవసరమైన ఆర్థిక సహాయం కూడా రాజ్‌బహదూర్‌ చేశాడు. ఒకసారి రజనీకాంత్‌ నాటక ప్రదర్శనను ప్రముఖ దర్శకులు కె.బాలచందర్‌ చూశారు. అనంతరం రజనీ నటనకు మెచ్చుకొని తమిళం నేర్చుకోవాలని సూచించారు. తమిళం నేర్చుకున్న అనంతరమే ఆయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

సినిమాల్లోకి...
1975లో విడుదలైన అపూర్వ రాగాంగల్‌ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు రజనీకాంత్‌. ఈ సినిమా ఆయనకు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు కె.బాలచందర్‌ దర్శకత్వం వహించారు. క్రమక్రమంగా ఆయన తమిళ సినీ రగంలో సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఆతర్వాత ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించారు. బాలీవుడ్‌లో సైతం హిట్‌ సినిమాలతో తనదైన ముద్ర వేశారు. 2007లో విడుదలైన శివాజీ చిత్రంలో నటించినందుకు గాను ఆయనకు 26 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించడం విశేషం. దీంతో ఆసియాలో హీరో జాకీ ఛాన్‌ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న రెండవ హీరో అయ్యారు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా కూడా చేశారు. ఇక ఇటీవల విడుదలైన రోబో చిత్రం రజనీకి ఎంతో పాపులారిటీ తీసుకువచ్చింది. చంద్రముఖి, భాషా, శివాజీ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు రజనీకాంత్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి.

అవార్డులు...
పాపులర్‌ హీరో రజనీకాంత్‌కు 2000 సంవత్సరంలో పద్మ భూషణ్‌ అవార్డు దక్కింది. 1984లో రజనీకాంత్‌కు నల్లవనుకు నల్లవన్‌ అనే తమిళచిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్‌ బెస్ట్‌ తమిళ్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది. మూంద్రు ముగమ్‌, ముత్తు, పదయప్ప, చంద్రముఖి, శివాజీ చిత్రాల్లో నటనకు గాను ఆయనకు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు వచ్చాయి. 1984లో కలైమమాని అవార్డు, 1989లో ఎంజిఆర్‌ అవార్డులు దక్కాయి. 1995లో సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆయనకు కలైచెలవమ్‌ అవారును అందజేసి ఘనంగా సత్కరించింది. ఇవేగాకుండా పలు అవార్డులెన్నో ఆయన్ని వరించాయి.

కుటుంబ నేపథ్యం...
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 1950 సంవత్సరం డిసెంబర్‌ 12వ తేదీన బెంగళూర్‌లో జన్మించారు. ఆయన మహరాష్ట్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాంభాయ్‌, రామోజీరావు గైక్వాడ్‌లు. వారి సంతానంలో చిన్నవాడు రజనీకాంత్‌. ఇద్దరు అన్నలు, ఒక అక్క ఆయనకు ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. ఐదు సంవత్సరాల వయసులో తల్లి మృతిచెందడంతో రజనీకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమ యంలో వారి కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమైంది. చివరికి చిన్నతనంలోనే రజనీకాంత్‌ చిన్న,చిన్న ఉద్యోగాలె న్నింటోనో చేశారు. కూలీగా సైతం పనిచేశారు. ఆయన బెంగళూర్‌లోని ఆచార్య పాఠశాలలో చదువుకున్నారు. రామ కృష్ణ మిషన్‌ విద్యా సంస్థలలో ఉన్నతవిద్యను అభ్యసించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1966 నుంచి 1973 వరకు బెంగళూర్‌, చెనై్న నగరాల్లో పలుచోట్ల పనిచేశారు. కొంతకాలం బెంగళూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌లో బస్‌ కండ క్టర్‌గా సైతం పనిచేశారు రజనీకాంత్‌. ఇక రజనీకాంత్‌ సినిమాల్లోకి వచ్చిన అనంతరం 1981లో మన రాష్ర్టంలోని తిరుపతిలో లతా రంగచారి అనే యువతిని 31 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 1981 సం వత్సరం ఫిబ్రవరి 26న జరిగింది. వారికి ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వర్య వివాహం తమిళ హీరో ధనుష్‌తో జరుగగా, సౌందర్య వివాహం పారిశ్రామికవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో జరిగింది.