Sunday, January 1, 2012

ప్రాంతీయ పత్రికలు సర్కులేషన్‌లో 8.23 శాతం వృద్ది

న్యూఢిల్లీ, జనవరి 1: భారత్‌లో వార్తా పత్రికల సర్క్యులేషన్ పెరుగుతోంది. 2010-11 సంవత్సరంలో కూడా 8శాతానికిపైగా వృద్ధి నమోదైంది. అందులోనూ ప్రాంతీయ పత్రికల హవానే ఎక్కువ. గత ఏడాది దేశంలోని వార్తాపత్రికల సర్క్యులేషన్ 8.23శాతం పెరిగింది. 'రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా'(ఆర్ఎన్ఐ) తన 55వ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. పాశ్చాత్య దేశాల్లో పత్రికా రంగం అనిశ్చితిలో పడినప్పటికీ.. భారత్‌లో మాత్రం దాని ప్రభావం లేదని ఆర్ఎన్ఐ విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 3671 వార్తా పత్రికలు ప్రచురితమయ్యాయి. ఢిల్లీలో 1933, మధ్యప్రదేశ్‌లో 1243 పత్రికలు వెలువడ్డాయి.

సర్క్యులేషన్ విషయంలో కూడా యూపీనే ముందుంది. అక్కడ 6.97కోట్ల ప్రతులు అమ్ముడవుతున్నాయి. ఇక ఢిల్లీలో 5.27 కోట్లు, మూడోస్థానంలో ఉన్న మహారాష్ట్రలో 2.9 కోట్ల కాపీలు చలామణి అవుతున్నాయి. ప్రాంతీయ పత్రికల గురించి ప్రస్తావిస్తూ.. అవి తమ ప్రాంత ప్రజలు అధికంగా ఉన్న ఇతర నగరాల్లో కూడా ఎడిషన్లు ప్రారంభిస్తున్నాయని ఆర్ఎన్ఐ వ్యాఖ్యానించింది. ఇక అత్యధిక మల్టీ ఎడిషన్ పాఠకులతో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' అగ్రస్థానంలో నిలిచింది. 12 ఎడిషన్లు కలిపి దీనికి 37,46,929 కాపీల సర్క్యులేషన్ ఉందని ఆర్ఎన్ఐ నివేదిక పేర్కొంది. పీరియాడికల్స్ (నియతకాలిక పత్రికలు) విభాగంలో 'ద హిందూ వీక్లీ' ముందుకు దూసుకెళ్లింది.

గత ఏడాది దేశంలో 603 ద్విభాషా, 78 బహు భాషా పత్రికలు విడుదలయ్యాయి. కాగా,1406 ఇంగ్లీష్ పత్రికల్లో 728 నాలుగు మెట్రో నగరాల నుంచే వెలువడుతున్నాయి. రాష్ట్రాల రాజధానులు, ప్రముఖ పట్టణాలు వంటి 21 ప్రాంతాల నుంచి వందకుపైగా పత్రికలు ప్రచురితమవుతున్నాయి. దేశంలో ఉన్న 14,508 వార్తా పత్రికల్లో దాదాపు 11,775 పత్రికలు స్వతంత్ర వ్యక్తుల ఆధ్యర్యంలోనే నడుస్తున్నాయి. ఇవే మార్కెట్ సర్క్యులేషన్‌లో అత్యధిక వాటా(56.59శాతం) చేజిక్కించుకుంటున్నాయి.

No comments:

Post a Comment