Sunday, January 1, 2012

రాకాసి బిల్లులకు ఈ ప్రాంతం ఆలవాలం

ఆదిలాబాద్ నుంచి రాజమండ్రి దాకా..
రాకాసి బిల్లులకు ఈ ప్రాంతం ఆలవాలం
అగ్ని పర్వత విస్పోటంతో జీవజాలం నాశనం
మహాబలేశ్వర్ సమీపంలో భారీ పేలుడు
గో'దారి'లో సాగిన లావా ప్రవాహం
లోలోతు లావాలోనే ఖనిజ నిక్షేపాలు
తాజా పరిశోధనల్లో వెల్లడి

ఒక్కసారి కళ్లు మూసుకోండి! చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనసులోంచి చెరిపేయండి. గతంలోకి వెళ్లిపోండి! బాగా గతంలోకి... ఇంకా ఇంకా... ఇంకా గతంలోకి! ఆ గతం ఎలా ఉండేదో తెలుసా?

భారీ సైజులో డైనోసార్లు, వింత మృగాలు, రకరకాల పక్షి జాతులు, గాలిలోని ఆక్సిజన్ శాతంలో ఏమాత్రం తేడా వచ్చినా విలవిలలాడిపోయే సముద్ర జీవులు, చిత్రవిచిత్రమైన వృక్షాలు- ఒక్క మాటలో చెప్పాలంటే మనం నివసిస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు జురాసిక్ పార్క్‌లా ఉండేది. ఆ సమయంలో... ఒక పెద్ద అగ్ని పర్వతం బద్దలయింది. దాని నుంచి కొన్ని వేల కోట్ల టన్నుల లావా పొంగిపొర్లింది. అదే స్థాయిలో బూడిద, రకరకాల వాయువులు వాతావరణంలో కలిశాయి. ఆమ్ల వర్షాలు కురిశాయి. ఈ బీభత్సానికి డైనోసార్లతో సహా వృక్ష, జీవ జాతులన్నీ సర్వనాశమయిపోయాయి. అలా ఉప్పొంగిన లావా నెమ్మదిగా గట్టిపడింది. లక్ష సంవత్సరాలు గడిచేసరికి లావా ప్రవహించిన ప్రాంతంలో మార్పులు మొదలయ్యాయి. లావా బాగా లోతుగా పేరుకు పోయిన ప్రాంతంలో ఖనిజాలు, చమురు, సహజ వాయు నిక్షేపాలు ఏర్పడ్డాయి. ఇదేదో జురాసిక్ పార్క్-4 సినిమా కాదు. నిజంగా నిజం! ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో తేలిన విషయం. లావాలో చిక్కుకుపోయిన సముద్ర జంతువుల అవశేషాల సాక్షిగా రుజువైన నిజం. ఇంతకూ...

కొత్త సిద్ధాంతం!
భూమిపై ఉన్న జాతులన్నీ అంతరించిపోవటానికి మెక్సికో సమీపంలో చిక్సుక్లబ్ అనే ప్రాంతంలో పడిన గ్రహ శకలం కారణమని శాస్త్రవేత్తలు ఇప్పటి దాకా భావిస్తూ వచ్చారు. అయితే.. కేవలం గ్రహ శకలం వల్ల డైనోసార్లు, ఇతర జీవులు అంతరించిపోయాయనే వాదనలో అంత పస లేదని తేలింది. లావా ప్రవాహం, యాసిడ్ వర్షాల పాత్ర ఎంతో ఉందని ఆధారాలు లభించాయి. దీనిపై భవిష్యత్తులో జరిగే మరిన్ని పరిశోధనలకు రాజమండ్రి కేంద్ర బిందువు కానుంది.

ఇదీ జరిగింది!
"మునుపు ఇక్కడ ఎక్కువగా బీడు భూములు, ఈత, పైన్ జాతులకు చెందిన చెట్లు ఉండేవి. డైనోసార్ల పేడపై పరిశోధనలు చేసినప్పుడు అవి ఈ జాతుల చెట్ల ఆకులనే తినేవని తేలింది. అగ్నిపర్వతాలు బద్దలైన అనంతరం వెలువడిన విష వాయువుల వల్ల తేమ పెరిగింది. ఆ తేమ వల్ల గడ్డి మొక్కలు పెరగటం మొదలైంది. లావా గడ్డకట్టడం వల్ల మట్టి సాంద్రత తగ్గకపోగా, కాలంతో పాటుగా లావా మట్టిగా మారింది. దీని వల్ల భూసారం మరింతగా పెరిగింది'' - నాగపూర్ వర్సిటీ ప్రొఫెసర్ వందనా సామంత్

హైదరాబాద్, జనవరి1 : ఆదిలాబాద్ సమీప ప్రాంతాల్లో డైనోసార్లు ఉండేవని ఇప్పటిదాకా జరిగిన అధ్యయనంలో తేలింది. తాజా పరిశోధనల నేపథ్యంలో ఇవి కోస్తా ప్రాంతంలో కూడా సంచరించేవని స్పష్టమైంది. ఈ డైనోసార్లు ఎలా మరణించాయనే అంశంపైనా శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భూమిని ఓ భారీ గ్రహ శకలం తాకిందని, దీని తాకిడికి భూమిపై నివసించే జీవ, వృక్ష జాతులన్నీ నశించాయని ఒక సిద్ధాంతం చెబుతోంది. చాలా మంది శాస్త్రవేత్తలు దీనినే సమర్థిస్తూ వచ్చారు. అయితే... ఇది నిజం కాదని, లావా ప్రవాహమే జీవ జాతుల హననానికి కారణమని ఇప్పుడు ఆధారాలు లభించడంతో శాస్త్రీయ ప్రపంచంలో సంచలనం చెలరేగింది.

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తాము చేసిన పరిశోధనల గురించి ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్న కెల్లర్ 'ఆన్‌లైన్'కు ప్రత్యేకంగా వివరించారు. ఆమెతోపాటు ఈ పరిశోధనల్లో పాల్గొన్న చెన్నైలోని ఓఎన్‌జీసీ ప్రాంతీయ ప్రయోగశాలలో ముఖ్య శాస్త్రవేత్తగా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎ.ఎన్. రెడ్డి, నాగపూర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వందనా సామంత్ కూడా 'ఆన్‌లైన్'కు ఈ వివరాలు తెలిపారు. కృష్ణా గోదావరి బేసిన్‌లో సహజ వాయువు, చమురు ఎలా ఏర్పడ్డాయి? కోనసీమ ప్రాంతం ఇప్పుడు అంత సస్యశ్యామలంగా ఉండటానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వీరు అందించిన వివరాల ప్రకారం...

ఒకప్పుడు...
దాదాపు 6 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళితే..... ఇప్పుడున్నట్లుగా భూమి 'ఖండ' ఖండాలుగా ఉండేది కాదు. భారత్, ఆఫ్రికా కలిసి ఉండేవి. డైనోసార్లతో సహా భారీ జంతు జాలానికి ఈ భూమి ఆవాసంగా ఉండేది. అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు బద్దలవుతూనే ఉన్నా... వాటి ప్రభావం పరిమితంగానే ఉండేది. ఒకసారి... ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర ఉన్న అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి.

ఇది ఎంత శక్తిమంతమంటే... ఆ లావా ప్రవహించిన ప్రాంతమంతా బూడిదైపోయింది. లక్షలాది జీవులు లావాలో చిక్కుకుని మరణించాయి. ఈ లావా దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి సమీపంలో బంగాళాఖాతంలో కలిసిపోయింది. "అంతకుముందు కూడా మహాబలేశ్వర్‌లో నాలుగు విస్ఫోటాలు జరిగాయి. కానీ... లావా కొంత వరకు మాత్రమే ప్రవహించి ఆగిపోయింది'' అని ప్రొఫెసర్ కెల్లర్ వివరించారు.

జీవుల హననం...
భారీ అగ్నిపర్వతం విస్ఫోటానికి ముందు భూమిపై రెండు రకాల జీవులు నివసిస్తుండేవి. ఎనభై అడుగుల దాకా ఎత్తున్న భీకరమైన డైనోసార్‌లు భారీ జీవులు! చిన్న చిన్న జీవులు అని అనుకునేవి కూడా పది అడుగుల ఎత్తు ఉండేవి. సముద్రంలోనూ రకరకాల జీవులు ఉండేవి. "లావా భీకరమైన వేగంతో సముద్రంలో కలిసినప్పుడు... అందులో కొన్ని జీవులు చిక్కుకుని గడ్డకట్టుకుపోయాయి.

అలాంటి జీవుల అవశేషాలను ఓఎన్‌జీసీ బావుల వద్ద జరిపిన తవ్వకాల్లో కనుగొన్నాం. ఆ సమయంలో ప్లాంక్‌టోనిక్ ఫోర్మామినిఫిరా అనే జీవినివసించేది. దీనికి సంబంధించిన కొన్ని అవశేషాలు మాకు లావా పొరల్లో దొరికాయి. ఈ ఫోర్మామినిఫిరా ఏక కణజీవి. ఆక్సిజన్ ఆధారంగా బతుకుతుంది. వాతావరణంలో ఏ మాత్రం ఆక్సిజన్ తగ్గినా ఇది మరణిస్తుంది. ఓఎన్‌జీసీ బావుల వద్ద జరిపిన తవ్వకాల్లో ఇది దొరకడంతో... వాతావరణంలో వచ్చిన మార్పులను పసిగట్టేందుకు అవకాశం లభించింది'' అని కెల్లర్ వివరించారు.

వాతావరణంలో మార్పులు...
సాధారణంగా అగ్ని పర్వతాల నుంచి లావా ప్రవాహంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్, ఇతరత్రా విషవాయువులు కూడా వెలువడతాయి. "వీటివల్ల వాతావరణంలో ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. దీనివల్ల యాసిడ్ వానలు పడతాయి. ఈ మార్పులు భూమిపై ఉన్న జీవులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఆ సమయంలో కూడా ఇదే జరిగింది. జీవుల రూపురేఖల్లో మార్పులు వచ్చాయి'' అని ఈ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ వందనా సామంత్ వివరించారు. కేవలం జీవ జాతులే కాదు. వృక్ష జాతులు కూడా ఈ మార్పులకు తట్టుకోలేకపోయాయి. "రాజమండ్రి సమీపంలో లభించిన అవశేషాలను, మేఘాలయలో దొరికిన కొన్ని నమూనాలను పోల్చి చూశాం.

అప్పట్లో ఆమ్ల వర్షాలు కురిసినట్లు ఈ పరిశోధనలో స్పష్టమైంది'' అని కెల్లర్ తెలియజేశారు. కాలంతోపాటుగా విషవాయువుల సాంద్రత తగ్గటం మొదలయిందని... జీవం ఆవిర్భవించటానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. "వాతావరణంలో వచ్చిన మార్పులు, సముద్ర మట్టంలో వచ్చిన హెచ్చు తగ్గుల వల్లే చిన్న చిన్న జీవులు పుట్టాయని ఇప్పటిదాకా భావిస్తున్నాం. కానీ... దీనికి ఆమ్ల వర్షాల తర్వాత ఏర్పడిన వాతావరణమే కారణమని మా పరిశోధనలో తేలింది'' అని వందన తెలిపారు.

ఖనిజ సంపదకు కారణం...
కృష్ణా-గోదావరి డెల్టాలో ఖనిజ నిక్షేపాలు ఎలా ఏర్పడ్డాయో కూడా ప్రిన్స్‌టన్ వర్సిటీ నిపుణుల పరిశోధనలో తెలిసింది. "ఒకప్పుడు భూ ఉపరితలమంతా కలిసి ఉండేది. దాదాపు 25 కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో రెండు వేల అడుగుల కింద ఉన్న ద్రవ పదార్థం (మాగ్నా) పైకి ఎగజిమ్మింది. ఈ పేలుడు వల్ల భూభాగం కొంత పక్కకు జరిగింది. ఇలాంటి పేలుళ్లు తరచూ జరగడం వల్ల భూ ఉపరితలంలో అనేక మార్పులు సంభవించాయి. ఒకప్పుడు భారత్ భూభాగం అంటార్కిటికాతో కలిపి ఉండేది. పేలుళ్ల వల్ల భారత్ భూభాగం నెమ్మదిగా ఉత్తర దిశకు పయనించటం మొదలుపెట్టింది. అది మడ్గాస్కర్ దగ్గరకు వచ్చి చేరింది.

ఆ సమయంలో మడ్కాస్కర్‌లో మరో పేలుడు జరిగింది. దీంతో భారత్ భూభాగం కదులుతూ వచ్చి ఇప్పుడున్న చోట స్థిరపడింది'' అని ఓఎన్‌జీసీకి చెందిన డాక్టర్ ఎ.ఎన్. రెడ్డి తెలిపారు. ఇలా భూభాగం కదలడం వల్ల భారత్‌కు రెండు ప్రయోజనాలు ఏర్పడ్డాయి. భారత్ భూభాగంలో అగ్ని పర్వతాలు లేకపోవడం మొదటి ప్రయోజనమైతే.. మన భూభాగంలో ఉన్న లావా గడ్డకట్టడం మరొకటి. ఈ మార్పుల వల్ల కృష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఏర్పడ్డాయి. అనేక రకాల ఖనిజాలు కూడా ఏర్పడ్డాయి. దీంతోపాటుగా రాజమండ్రి సమీప ప్రాంతాల్లో అత్యంత సారవంతమైన భూములు కూడా ఏర్పడటానికి ఈ మార్పులు కారణమయ్యాయి.

-స్పెషల్ డెస్క్

కచ్ టు రాజమండ్రి 'లావా'రిస్! ఈ ఫొటో చూశారా!? ఇందులో గుజరాత్‌లోని కచ్ నుంచి బంగాళాఖాతం వరకు కనిపిస్తున్న ఆ ఎర్రటి ప్రాంతమంతా ఏమిటనుకున్నారు!? ప్రపంచంలోనే అత్యంత దూరం లావా ప్రవహించిన ప్రాంతమిది. దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల కిందట మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. వాటి నుంచి పెల్లుబికిన లావా.. అటు గుజరాత్‌లోని కచ్ వరకూ వెళ్లింది. ఇటు.. దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి సమీపంలో బంగాళాఖాతంలో కలిసింది. అప్పట్లో లావా ప్రవహించిన ప్రాంతమే ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా లావా అత్యధిక దూరం ప్రయాణించిన ప్రాంతం కూడా ఇదే!

No comments:

Post a Comment