Thursday, December 8, 2011

కండలు తిరిగిన మొనగాడు

కలకత్తాలోని హౌరా రైల్వేస్టేషన్‌లో శాండో కోసం అనేక వందల మంది ఎదురుచూస్తున్నారు. ట్రైన్ రావటానికి ఒక గంట ముందే అక్కడ ప్రజలు గుమిగూడారు. ఇండియన్ డైలీ న్యూస్‌లో ఆ సంఘటన గురించి ఇలా రాశారు. - "అనేకమంది యూరోపియన్లు, ఇండియన్లు కూడా స్టేషన్‌కు వచ్చారు. వీరిలో అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు ఉన్నారు. అప్పటిదాకా వారందరూ శాండో ఫోటోలు పుస్తకాలలో మాత్రమే చూశారు. రైలు కూత వినబడగానే అందరిలోను ఆతృత పెరిగింది. ముందుకు దూసుకువస్తున్న ప్రజలను పోలీసులు బలవంతంగా ఆపాల్సి వచ్చింది. శాండో దిగిన వెంటనే అందరూ అతనిని చుట్టుముట్టారు. కొందరు శాండో సామాన్యంగానే ఉన్నాడని గుసగుసలాడుకున్నా మొత్తం మీద శాండోకు ఘన స్వాగతం లభించిందనే చెప్పాలి.''

కలకత్తా రాయల్ థియేటర్‌లో కూడా శాండోకు మంచి ప్రజాదరణ లభించింది. శాండో షోకు మొత్తం హాలంతా నిండిపోయింది. అప్పర్ క్లాస్ మాత్రమే కాకుండా కింది కుర్చీలన్నీ కూడా నిండిపోయాయి. సీట్లు దొరకకపోవటం వల్ల చాలామంది నిలబడాల్సి వచ్చింది కూడా. కలకత్తాలో నివసించేవారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ అనేకమంది ప్రముఖులు శాండోను చూడటానికి వచ్చారు. బ్రిటిష్‌వారు, భారతీయులు- శాండోకు స్వాగతం చెప్పటంలో పోటీలుపడ్డారు. బ్రిటిష్‌వారు- తమ సైనికులు, అధికారులకు శాండో కొన్ని వ్యాయామ మెలకువలు చెప్పాలని ఆశించారు. భారతీయులేమో అతనికి అలాంటి శరీరం రావటానికి వెనకున్న మర్మాన్ని తెలుసుకోవాలని భావించారు.

రాచ మర్యాదలు..
భారతీయులు శాండో పట్ల చాలా గౌరవాన్ని ప్రదర్శించారు. అతనికి అనేక బహుమతులు ఇచ్చారు. శాండో తన బృందంతో ప్రదర్శనలు ఇవ్వటానికి దేశంలో కొన్ని ప్రాంతాలు తిరిగాడు. అతను ప్రదర్శనలు ఇచ్చే టెంటుల్లో ఆరు వేల మంది పట్టేవారు. అయినా అనేక వేల మంది నిరాశతో వెనకకు తిరిగి వెళ్లిపోయేవారు. స్థానిక ప్రజలు అతనిని శాండో పహిహల్వాన్ అని పిలిచేవారు. భారతదేశంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన గామన్ బలివాలా పహిల్వాన్ తనతో పోటీకి రమ్మని శాండోకు సవాల్ విసిరాడు. అయితే శాండో ఈ సవాల్‌ను స్వీకరించలేదు. గామన్‌ను కుస్తీలో ఎదిరించటం అంత సులభమైన పని కాదని శాండోకు తెలుసు.

శాండోకు ఈ పర్యటనలో అనేకమంది మహారాజులు స్నేహితులయ్యారు. బరోడా మహారాజు గైక్వాడ్ తన ప్రైవేట్ మ్యూజియంలో ఉంచటానికి శాండో విగ్రహాన్ని తయారుచేయమని శిల్పులను ఆదేశించాడు. ఒక యువరాజు శాండోను తన ప్యాలెస్ నుంచి కారులో 40 మైళ్ల విహారానికి తీసుకువెళ్లాడు. "మేము వెళ్తున్న దారిలో చాలా చోట్ల బళ్లు ఉన్నాయి. మొదట వాటిని నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత వాటిని కావాలని ఉంచారా? లేకపోతే అవి ఆ ప్రాంతంలో ఎప్పుడూ ఉండేవేనా అనే అనుమానం వచ్చింది. అయితే- మోటారు పాడైపోతుందనే భయంతో, ఆ యువరాజు, ప్రతి మైలుకు ఒక బండిని ఉంచాడని తెలిసింది'' అని శాండో ఆ తర్వాత పేర్కొన్నాడు.

పరదా వెనక..
ముంబాయిలో శాండో కొత్త స్నేహితుడు ధున్‌జీభాయ్ బొమన్‌జీ శాండోను తన ప్యాలెస్‌కు ఆహ్వానించాడు. ఉన్నత వర్గాలకు చెందిన పార్సీ మహిళలకు వ్యాయామానికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వమని శాండోను కోరాడు. జనానాలో ఉన్న మహిళలు పరపురుషుల కంటబడరు కదా. పరపురుషులు కూడా జనానాలోకి వెళ్లకూడదు. అయితే శాండో కోసం ఈ నిబంధనను సడలించారు. "నాకు, వారికి మధ్య పూసలతో చేసిన ఒక పరదా ఉంది. దాని అవతల ఆ స్త్రీలు కూర్చున్నారు. నేను వారిని చూడకూడదని వారు ఉన్న ప్రాంతాన్నంతా చీకటి చేసేశారు. వారిపై కన్నేసి ఉంచటానికి కూడా కొందరు ఉన్నారు.

నేనున్న ప్రాంతమంతా చాలా కాంతివంతంగా ఉంది. నన్ను పరదా అవతల ఉన్నవారు చక్కగా చూసేలా. నేను వారి వైపు తిరిగి సులభమైన వ్యాయామాలు చేయటం మొదలుపెట్టాను. పరదా అవతల నుంచి కొన్ని కదలికలు మొదలయ్యాయి. వారు నన్ను అనుకరిస్తూ వ్యాయామం చేస్తున్నారని అర్థమయింది. పాఠం చెప్పటం పూర్తయిన తర్వాత - పరదా అవతల ఉన్న స్త్రీలు - నా చేతి కండరాలను ముట్టుకుని చూడాలని ఉందని ఒక సందేశం పంపారు. నేను పరదాకు దగ్గరగా వెళ్లాను. నా చేతులను పైకి ఎత్తి కండరాలను బిగించాను. ఒక అరడజను చిన్న చేతులు నా కండరాలను తడిమాయి..'' అని శాండో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇది జరిగినప్పుడు తన పక్కన తన సతీమణి కూడా ఉందని ఆయన ఎలాంటి వివాదమూ రాకుండా ఉండడానికి ముందే జాగ్రత్తపడి రాసుకున్నాడు.

జాతీయవాద పాఠాలు
ఒక పాత్రికేయుడు బెంగాలీలందరూ శాండో నేర్పిన పాఠాలను నేర్చుకుని వ్యాయామం చేయటం మొదలుపెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. వారు కూడా తనలాగే అవుతారని, సున్నితంగా ఉండేవారు బలంగా అవుతారు అని శాండో సమాధానమిచ్చాడు. తాను నేర్పిన పాఠాలను నేర్చుకొని బలంగా అయిన అనేకమంది ఉదాహరణలను కూడా శాండో వివరించాడు. వ్యక్తులు బలంగా లేకపోవటమనేది జాతికి సంబంధించిన వ్యవహారం కాదని- పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవటం, సరైన వ్యాయామం చేయకపోవటం వల్ల మాత్రమే ఎవరైనా బలహీనంగా ఉంటారని పేర్కొన్నాడు.

"వ్యాయామం, పౌష్టికాహారం ఉంటే భారతీయులు బలంగా తయారవుతారు. పట్టుదల ఎక్కువ కనక మిగతా దేశాల వారి కంటే కూడా వారు త్వరగా బలాఢ్యులు కాగలిగే అవకాశం ఉంది. వారు తమ శరీరాలను జాగ్రత్తగా చూసుకుంటే 200 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు'' అని శాండో వ్యాఖ్యానించాడు. భారత జాతీయవాదుల ఆశయాలను ప్రొత్సహించే ఉద్దేశం శాండోకు లేదు. కాని తమ శరీరాలను బలిష్టంగా మార్చుకోవటం ద్వారా స్వాధికారతను సాధించటం సాధ్యమేననే సందేశం ఇచ్చి జాతీయవాదుల ఆశయాలను ప్రోత్సహించాడు. ఆ తర్వాత శరీర దారుఢ్యం - స్వాతంత్య్రానికి, రాజకీయ అధికారానికి తొలి అడుగుగా భావించినవారు అనేక మంది ఉన్నారు. వీరిలో స్వామి వివేకానంద కూడా ఒకరు. (స్వామి వివేకానంద మూడు 'బి'లను ప్రతిపాదించారు. అవి బీఫ్ (గొడ్డు మాంసం), బైసప్స్ (బలమైన ముంజేతి కండరాలు), భగవద్గీత). విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు సరళాదేవి ఘోషాల్ శాండో పర్యటన తర్వాతే అతివాద నేతగా మారారు.

యోగాపై ప్రభావం
శాండో పర్యటన భారత్‌పై గణనీయమైన ప్రభావం చూపించిందనిప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు డబ్ల్యుటీ స్టెడ్ అభిప్రాయం. ఆ తర్వాత ట్రీట్‌మెంట్‌ల కోసం మహారాజులు లండన్ సెయింట్ జేమ్స్ వీధిలో ఉన్న శాండో ఆఫీసుకు వస్తూ ఉండేవారు. అనేకమంది మహారాజులు తమకు వ్యాయామాలను నేర్పటానికి ప్రతినిధులను భారత్‌కు పంపమని శాండోను కోరుతూ ఉండేవారని పేర్కొన్నారు. వీటితో పాటు యోగా పట్ల భారతీయులలో ఆసక్తి ఏర్పడటానికి కూడా ఒకరంగా శాండో పర్యటనే కారణం. ప్రస్తుతం ఉన్న ఆసనాల పద్ధతి ఆధారంగా చూస్తే- యోగా అనేది 20వ శతాబ్దం తొలి భాగంలో పుట్టిందే. కొందరు చరిత్రకారుల ఉద్దేశం ప్రకారం- ఆధునిక యోగాపై భారతీయ సంప్రదాయం కన్నా పాశ్చాత్యుల (శాండో వంటివారు) ప్రభావం ఎక్కువ ఉంది. అంతే కాకుండా ఇతర రంగాలపై కూడా శాండో ప్రభావం కనిపిస్తుంది. తొలి భారతీయ సినిమా నటులలో ఒకరైన రాజా బలంగా, మంచి శరీర ధారుడ్యంతో ఉండేవాడు. కనుక అతనికి రాజా శాండో అనే పేరు వచ్చింది. శాండోకు ఇండియా ఎంత నచ్చిందో, భారతీయులకు శాండో అంతగానూ నచ్చాడు. శాండోను 'దేహదారుఢ్యం గల ఫకీర్'గా భావించారు వాళ్లు.

ధున్‌జిభాయ్ బొమన్‌జీకి ఉన్న ఒక వ్యాధిని నయం చేసిన కారణంగా ఆయన శాండోకు చాలా ఎక్కువ మొత్తం ధనం ఇచ్చాడు. శాండో ఇండియాలోనే ఉండిపోతే ఏటా 10 వేల పౌండ్లు ఇస్తానని కూడా చెప్పాడు. శాండో దానికి ఒప్పుకోలేదు కాని లండన్ దగ్గర్లో తాను కట్టుకున్న ఇంటికి మాత్రం బొమన్‌జీ పేరు పెట్టుకున్నాడు. అలాగే బొమన్‌జీ ముంబయిలో ఆయన పేరుతో 'శాండో కాజిల్' కట్టాడు.

No comments:

Post a Comment