Friday, December 9, 2011

కన్నీళ్ల నుంచి కాసులు

ab December 1st, 2011
ఇటీవలి కాలంలో అత్యంత విస్తృతంగా న్యూస్ హెడ్ లైన్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన సినిమా! సినిమా అనౌన్స్‌మెంట్ నుండి ఇప్పటివరకూ ఈ సినిమా ఏదో ఒక రూపంలో వివాదాలు సృష్టిస్తూనే ఉంది. అసలు ఈ సినిమా నేపథ్యం- 1980 దశకంనాటి దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీ అనీ, అందులోనూ ఆనాటి సెక్సీ నటి సిల్క్‌స్మిత రియల్ లైఫ్ ఈ సినిమాకు ఆధారం అనీ ప్రకటించినప్పటి నుండీ, ఇది ఒకవైపు ఆసక్తినీ, మరోవైపు ఆక్షేపణలనీ సృష్టించింది..
సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించడం కూడా ఈ దుమారానికి మరింత ఆజ్యం పోసింది... ఇక సిల్క్‌స్మిత బంధువులు ఈ సినిమాపై కోర్టును ఆశ్రయించడం ఇటీవలి ట్విస్ట్. దీనిని అధిగమించడానికి గాను, ఈ సినిమా నిర్మాత ఏక్తాకపూర్ ప్లేట్ మార్చేసి ‘డర్టీ పిక్చర్’ సినిమా సిల్క్‌స్మిత లైఫ్ స్టోరీ కాదని ప్రెస్‌మీట్‌లలో చెప్పింది... మొత్తంమీద ఏక్తాకపూర్ మాత్రం తన సినిమాకు కావలసినంత పబ్లిసిటీని, క్రేజ్‌ని ప్రేక్షకులలోనూ, మీడియాలోనూ సృష్టించింది... ఇదంతా బాగానే ఉంది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇప్పుడు తెరమీదకు వచ్చిన అంశం ఏంటంటే- ప్రముఖ వ్యక్తుల నిజ జీవిత గాధల పేరిట, నిర్మాత, దర్శకులు చేస్తున్న ఈ పని వారి వ్యక్తిగత జీవితాలలోకి చొరబడటం కాదా? ప్రముఖుల వ్యథలను హైలైట్ చేసి తమ ఆదాయాలని పెంచుకోవడం కాదా? ప్రముఖుల కన్నీళ్ళని ‘క్యాష్’ చేసు కోవడం కాదా?
గతంలో లేవా?
పబ్లిక్ పర్సనాలిటీలు, సెలెబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథలను తెరకెక్కించడం అనేది ప్రస్తుతం ‘డర్టీ పిక్చర్’ సినిమాతో చర్చనీయాంశం అయింది. కానీ ఈ సంస్కృతి భారతీయ సినిమాలో ఓ ‘్ధరణి’గా చాలాకాలంనుంచే ఉందని చెప్పాలి... అంతేగాక, ఈ తరహా సినిమాల నిర్మాణం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాదని కోలీవుడ్ (తమిళ సినీ పరిశ్రమ), మాలీవుడ్ (మలయాళ సినీ పరిశ్రమ)లో కూడా జరిగిందని చెప్పాలి... అయితే, ఇప్పటివరకూ నిజజీవితం (రియల్ లైఫ్) ఆధారంగా వచ్చిన ‘‘రీల్ లైఫ్’’ సినిమాలను కూలంకషంగా పరిశీలిస్తే, అవి ప్రధానంగా రెండు రకాలుగా ఉన్నాయని అర్ధమవుతుంది.
* నిజ జీవిత సంఘటనలు- ఘటనల స్ఫూర్తితో తీసిన సినిమాలు
* నిజ జీవిత వ్యక్తుల జీవన ఘట్టాల స్ఫూర్తితో తెరకెక్కిన సినిమాలు...
సంఘటనలే ముడిసరుకు:
రోజూ దేశవ్యాప్తంగా ఎనె్నన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి... అయితే వాటిలో కొన్ని మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ప్రాంతం, భాష, కాలాలకు అతీతంగా ఓ మర్చిపోలేని ఘటనగా మిగిలిపోతాయి... అలాంటి సంఘటనలే సినీ నిర్మాత- దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆ యధార్థ

సంఘటనలకు కొంత డ్రామా... మరికొంత కల్పన జోడించి సినిమాలు తెరకి ఎక్కించడం జరిగింది... అలాంటి సినిమాలకి రియల్ ఇన్సిడెంట్స్ ముడిసరుకుగా మారాయి.
1992లో బాబ్రీమసీదు కూల్చివేత యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవిక సంఘటన. ఈ యధార్థ సంఘటనని నేపధ్యంగా చేసుకుని ‘‘బొంబాయి’’ (1995) సినిమాని మణిరత్నం తీసారు. అలాగే 2002 గుజరాత్‌లోని మత కల్లోలాలని ఆధారంగా చేసుకుని రాహుల్ ధోలాకియా ‘‘పర్జౌనియా’’ (2007) అనే సినిమానీ, ప్రముఖ నటి- చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షు

రాలు నందితాదాస్ ‘‘్ఫరాఖ్’’ అనే సినిమానీ తీసారు. అలాగే ముంబైలోని లోఖండ్‌వాలా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మాఫియా గ్యాంగ్‌కు- పోలీసులకు జరిగిన రియల్ ఎన్‌కౌంటర్ ఆధారంగా ‘‘షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా’’ (2007) సినిమాని తీసారు. ‘‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’’ కూడా ఈ తరహా లోనిదే.ఇక, దేశవ్యాప్తంగా సెనే్సషన్ సృష్టించిన క్రైమ్ కేసు- నీరజ్ గ్రోవర్ హత్య కేసు. ఈ సంఘటనని స్ఫూర్తిగా తీసుకుని రామ్‌గోపాల్‌వర్మ ఈమధ్యే ‘‘నాట్ ఎ లవ్ స్టోరీ’’ అనే సినిమాని తీసారు. ఇలా రియల్ లైఫ్ సంఘటనలని ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమాలు అన్నీ ప్రేక్షకులలో కావలసినంత ఇంట్రెస్ట్‌ని సృష్టించాయి. దానికి తగిన ఆదాయాలను కూడా ఆర్జించాయి.
రియల్ లైఫ్ కథలు:
సాధారణంగా, మన సినీ ప్రపంచంలో వ్యక్తుల నిజజీవిత గాధలను సినిమాలుగా తీయడాన్ని ‘‘బయోపిక్’’ జెనర్ సినిమాలు అంటారు. అయితే వీటిలో ఆయా వ్యక్తుల నిజ జీవితాన్ని సాధ్యమైనంత యధాతథంగా ఎలాంటి కాల్పనికతకూ తావులేకుండా ‘‘డాక్యుమెంట్’’ చేస్తారు... అయితే ఇవన్నీ అత్యున్నత కథా విలువలు- ప్రమాణాలు- విస్తృత అధ్యయనం- రీసెర్చ్ అనే నాలుగు స్తంభాలపై నిర్మించడం సహజం... కానీ ఈ ‘జెనర్’కు భిన్నంగా, నిజ జీవిత వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఎక్కువ కల్పన- డ్రామాలను మేళవించి కమర్షియల్ తరహాలో తీసిన సినిమాలే అత్యంత వివాదస్పదం అయ్యాయి. ఎందుకంటే, ఈ ‘‘ఇన్‌స్ప్రైర్‌డ్ సినిమాల’’లో కథలను దర్శకుడు బాక్సాఫీస్ మెకానిజంను, ఆడియెన్స్‌లోని ఎమోషన్స్‌ని దృష్టిలో పెట్టుకుని తీస్తాడు. దీనివల్ల అనివార్యంగా వాస్తవికత కాస్తా మరుగున పడిపోయి ఆసక్తికరమైన డ్రామానే డామినేట్ చేస్తుంది... ఈ కోవకు చెందిన సినిమానే ‘‘ద డర్టీ పిక్చర్’’ కూడా
అయితే, ఈ స్టైల్‌లో ఇదివరలో సైతం ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ సినిమాలు- ‘ది బ్యాండిట్ క్వీన్’ (్ఫలన్‌దేవి జీవితం), బవందర్ (్భన్వారీదేవి జీవతం), ప్రోవోక్‌డ్ (కిరణ్‌జిత్ అహ్లువాలియా జీవితం), గ్యాంగ్‌స్టర్ (అబూసలెమ్- మోనికా బేడీల ప్రేమ వ్యవహారం), కంపెనీ (దావూద్-్ఛటారాజన్ జీవితం), ‘డి’ (దావూద్ జీవితం), అబ్‌తక్ చప్పన్ (దయానాయక్ జీవితం), వో లమ్హే (పర్వీన్‌బాబీ జీవన దృశ్యం), సర్కార్ (బాల్‌థాకరే జీవన ఇతివృత్తం), గురు (్ధరూభాయ్ అంబానీ), చక్ దే ఇండియా (మీర్ రంజన్ నేగి క్రీడా జీవితం), రక్తచరిత్ర (పరిటాల రవి-సూరి జీవన దృశ్యాలు), రణ్ (జీటీవీ సుభాష్‌చంద్ర జీవితం) వంటివి ఉన్నాయి... అలాగే మలయాళంలో ‘తిరక్క్థ’ (నటి శ్రీవిద్య జీవితం ఆధారం), బెంగాలీలో ‘ఇతిమృణాళిని’ (అపర్ణాసేన్ డైరెక్షన్), భూమిక (మరాఠీ నటి హంసావాడ్కర్ జీవితం) ‘ఖోయాఖోయా చాంద్’ (గురుదత్ జీవితం) ఉన్నాయి. ఇక అప్పట్లో ఆంధీ (ఇందిరాగాంధీ జీవిత గాధ) సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
రియల్ కథలంటే ఆసక్తి ఎందుకు?
ప్రస్తుతం మన దేశంలో గొప్పగా చెప్పుకునే దర్శకులలో మొదటిశ్రేణి దర్శకులందరూ ‘రియల్ లైఫ్’ ఆధారంగా ‘రీల్ లైఫ్’ సినిమాలని సృష్టించినవారే... వీరికి కాల్పనిక కథలకన్నా నిజ జీవిత గాథలే ‘కిక్’ ఇస్తాయని వారి సినిమాలని గమనిస్తే అర్థం అవుతుంది. వారిలో రామ్‌గోపాల్‌వర్మ, మణిరత్నం, మిలన్ లూధ్రియా, మధుర్ భండార్కర్ (చాందినీబార్, పేజ్ 3, ఫ్యాషన్ సినిమాలన్నీ రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పిరేషన్ పొందిన సినిమాలే...) వంటి టాప్ దర్శకులున్నారు.అయితే సినిమా కథలకి ‘రియల్’ కథలే ఎందుకు అనేది ఓ ఆసక్తికరమైన ప్రశ్న.
నిజ జీవిత సంఘటనలు- వ్యక్తుల జీవన గాథలు సహజంగానే ప్రేక్షకులకు ఆసక్తిని కల్గించే అంశాలు. న్యూస్ రూపంలో, టాపికల్ డిస్కషన్స్ రూపంలో ఈ కథలను సగటు పౌరులు సైతం విని- చూసి- చర్చించి ఉంటారు. ఇలా ప్రేక్షకులకు ‘తెల్సిన నిజం’అనేది ఈ తరహా రియల్ లైఫ్ సినిమాలకు మిగతా సినిమాలకన్నా అదనపు ఆసక్తిని ప్రేక్షకుల మదిలో సృష్టిస్తోంది. మరోవైపున నిజ జీవిత సంఘటనలని కథలుగా చెప్పుకోవడం సాధారణ మానవ మనస్తత్వం... సైకాలజిస్టుల ప్రకారం ఈ గాథలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నపుడు, ఇతరులతో ‘షేర్’చేసుకొంటున్నపుడు వ్యక్తులు వాటిని తమ మస్తిష్కంలో దృశ్యీకరించుకోవడం జరుగుతుంది. ఇలా తాము ఊహించుకున్న చిత్రాలు- తెరపై చిత్రాలతో ఏమేరకు ‘మ్యాచ్’ అవుతాయో తెల్సుకోవాలనే ‘‘హ్యూమన్ ఇంటెరెస్ట్’’కూడా ఈ సినిమాలపై క్యూరియాసిటీకి కారణం.
ఇవేగాక, గొప్పవారుగా భావించే వ్యక్తులలోని చీకటి కోణాలని, సాధారణ మానవ తప్పిదాలని తెల్సుకోవాలనే సహజ ఆసక్తి కూడా ఓ కారణం... భారతదేశమంతటికీ సక్సెస్ స్టోరీగా నిలిచిన అంబానీ కట్నంకోసం తనకన్నా వయసులో పెద్ద అయిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడనే పర్సనల్ విషయం ప్రేక్షకులలో, ఆయన అఛీవ్‌మెంట్‌కన్నా ఎక్కువ ‘కిక్’నిస్తుంది. ఈ తరహా ‘ఎమోషన్స్’ని తట్టి లేపడంలో ఈ ‘రియల్ సినిమాలు’ సక్సెస్ అవుతున్నాయి... ఈ నేపథ్యంలోనే ‘డర్టీ పిక్చర్’ కూడా అదే ‘ఎలిమెంట్’ని హైలైట్ చేసి, ప్రేక్షకుల సహజమైన సైకలాజికల్ ఎమోషన్స్‌తో ‘ప్లే’ చేస్తోంది...
ఇక, సినిమా పరంగా, ఈ తరహా సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీ, మీడియాలో హైప్... డిబేట్స్ తప్పనిసరిగా ఏర్పడ్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో సినిమాని తీయడం ఒకెత్తయితే, ఆ సినిమాని ప్రేక్షకుల దగ్గరకు చేర్చడం మరో ఎత్తు. దీనికోసం ఓ సాధారణ సినిమాకు ప్రచార వ్యయాల రూపంలో అధిక మొత్తం ఖర్చు అవుతోంది... అదే ఈ ‘‘రియల్ సినిమాల’’ విషయానికొస్తే, ఇదంతా ఏమీలేకుండానే మీడియా ద్వారా ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. పైగా ‘‘మనోభావాలు’’ పేరిట ‘కాంట్రవర్సీ’ కూడా మొదలవుతోంది. దీంతో కోర్టు కేసులు, ఊరేగింపులు, నిషేధాలు, సెన్సార్ కత్తెరలు... ఇలా జరిగే ప్రతీ సంఘటనా ఆ సినిమాకు మీడియాలో అదనపు ప్రచారానే్న ఇస్తోంది. ఇదిలా ఉండగా, మనుషుల స్వభావంలో వివాదాలన్నా, కాంట్రవర్సీలన్నా ఓ ప్రత్యేక ఆసక్తి... ఈ ‘సైకలాజికల్ వీక్‌నెస్’ని కూడా ఈ సినిమాలు తట్టి లేపుతాయి.. ప్రేక్షకులను థియేటర్లవరకూ రప్పిస్తాయి. తాజా ‘డర్టీ పిక్చర్’ కూడా ఇదే సూత్రాన్ని పాటించింది.
వ్యక్తి‘గతం’పై దాడి?
ఈ తరహా రియల్ లైఫ్ సినిమాలు వ్యక్తుల అంతరంగిక జీవితాలపై దాడిగా కూడా భావించాల్సి వస్తోంది. ఇది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం, భారతీయ పౌరులైన ప్రతి ఒక్కరూ జీవించే హక్కును కలిగి ఉన్నారు. ఆ ‘‘జీవించడం’’ అనడంలో గౌరవంగా, మర్యాదగా, హుందాగా జీవించడం అనే అర్ధం అంతరార్ధంగా ఉంది. అయితే రియల్ లైఫ్ కథలతో వస్తున్న సినిమాలు, ఆయా వ్యక్తులు- ప్రముఖుల స్థాయికి- గౌరవానికి భంగం కలిగించే రీతిలో ఉండటం కూడా అనివార్యంగా జరుగుతోంది. ఆ లెక్కన ఇది గర్హనీయమే.
మరోవైపున, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, ప్రతి భారతీయుడికీ ‘‘్భవ ప్రకటనా స్వాతంత్య్రాన్ని’’ ఇచ్చింది. సినిమా ,కళలు, సాహిత్యం వంటివన్నీ ఈ హక్కును ఆసరాచేసుకునే సృజనాత్మక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అయితే ‘‘క్రియేటివ్ ఫ్రీడమ్’’ పేరిట ‘పర్సనల్ లైఫ్’పై వక్రీకరణాలు సమంజసమా? అనేది ‘ద డర్టీ పిక్చర్’ సినిమా మరోసారి లేవనెత్తింది.
అంతేగాక, ప్రముఖుల జీవితాలలోని కన్నీటి చీకటి కోణాలని, తమకు ఆదాయంగా మల్చుకోవడం ‘శాడిజమే’ అనీ ఈ తరహా ‘క్రియేటివ్ శాడిజమ్’ని ఎదిరించడం అవసరం అనే వాదన కూడా ఉంది. ఏదిఏమైనా సినీ నిర్మాత- దర్శకుల ‘క్రియేటివిటీ’కి వ్యక్తుల ‘డిగ్నిటీ’కి మధ్య జరిగే నిరంతర చర్చలో ‘ద డర్టీ పిక్చర్’ తాజా ఉదాహరణగా నిలిచిపోయింది... ‘‘ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్’’ అనే సామెతను మరోసారి నిరూపించింది. ఇలా ‘‘కన్నీళ్ళనుంచి కాసులు కురిపించడం’’ సాధ్యమనే నమ్మకం సినీ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఇలాంటి డర్టీ పిక్చర్‌లు, నాటీ పిక్చర్‌లుగా... హాటీ పిక్చర్‌లుగా వస్తూనే ఉంటాయి...!

No comments:

Post a Comment