Friday, December 9, 2011

గొలుసు ‘కొట్టు’.. సూపర్ హిట్టు!.

December 3rd, 2011, ab
కలిసికట్టుగా కృషి చేస్తే గడ్డిపోచలు మదపుటేనుగును సైతం బంధించగలవు... ఇది ఒకప్పటి సూక్తి. ఇప్పుడు ఇదే మన కార్పొరేట్ వ్యాపార సూత్రమైకూర్చుంది. ఒక్కచోట.. ఒక్క దుకాణం పెట్టుకు కూర్చుంటే ఫలితం లేదు.
ఊరూరా.. వాడవాడలా.. లెక్కకు మిక్కిలిగా, శాఖోపశాఖలుగా సంస్థలు విస్తరించితేనే వ్యాపారం అంతకు అంతై..అంతంతై అన్నట్లు వర్థిల్లుతుంది. ఇప్పుడంతా గొలుసుకట్టు సంగతులే. అదే..చైన్ సిస్టమ్. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో విస్తరించడమే ఇప్పుడు వ్యాపారాల విజయ సూత్రమైపోయింది.
చైన్ స్టోర్‌లు అన్నది ఫ్యాషనై కూర్చుంది. ఇది ఏదో ఒక్క వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. విద్య, వైద్య, ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, గోల్డ్, క్లాత్, రెడీమేడ్, లీజర్, స్టేషనరీ ఇలా అన్ని విభాగాల్లోనూ ఇదే తరహా నడుస్తోందిప్పుడు.
ఒకప్పుడు వేల పెట్టుబడితో నడిచే వ్యాపారాలన్నీ ఇప్పుడు కోట్ల స్థాయికి చేరాయంటే ఇది ఈ గొలుసు సంస్థల పుణ్యమే.
మనదేశంలో ఒకప్పుడు గొలుసు సంస్థలు అంటూ వుంటే అది కేవలం పెట్రోలు బంకులు మాత్రమే. అయితే అదీ కమీషన్ తరహాగా నడిచే వ్యాపారం. తొలిసారిగా రిలయన్స్, బాంబే డైయింగ్ సంస్థలు దేశవ్యాప్తంగా దుస్తుల వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. బాంబేడైయింగ్ సంస్థ అదే పేరుకి ముందు డీలర్ పేరు చేర్చి వ్యాపారం సాగిస్తే, రిలయన్స్ మంగళదీప్ పేరిట షోరూమ్‌లు ఏర్పాటు చేసింది.
ఆనాటి నుంచి ఈ నాటి వరకు పేరు మారినా విమల్ షోరూమ్‌లు ప్రతి చోటా వుండనే వున్నాయి. ఆ తరువాత దేశవ్యాప్తంగా చైన్ స్టోర్‌లుగా చెప్పుకోదగినది బాటా. దేశంలోని ప్రతి పట్టణంలో బాటా దుకాణం వుండి తీరేంతగా చైన్‌ను విస్తరింపచేసిందా సంస్థ. ఈ పరిస్థితి ఇలా నిలకడగా వున్న తరుణంలో గ్లోబలైజేషన్ పుణ్యమా అని వివిధ అంతర్జాతీయ సంస్థల కన్ను భారతీయ మార్కెట్‌పై పడింది. భారతదేశం అతి పెద్ద వినిమయ మార్కెట్‌గా వారికి కనిపించింది. అదే సమయంలో భారతదేశంలోని పెద్ద సంస్థలూ అదే రీతిగా ఆలోచించాయి. బ్రాండింగ్, గుడ్‌విల్, భారీ ఎత్తు అమ్మకాల ద్వారా, మార్జిన్ తక్కువగా వున్నా, లాభాలు ఎక్కువగా ఆర్జించవచ్చన్న కొత్త థియరీకి అంకురార్పణ చేసాయి. భారీ కొనుగోళ్లు, భారీ అమ్మకాలు, భారీ డిస్కౌంట్లు అన్న మూడు సూత్రాలపై ఈ చైన్ స్టోర్లు ఆకర్షణను సంతరించుకుంటున్నాయి. చైన్ స్టోర్ల పోటీ తట్టుకునేంతగా స్థానిక చిన్న వ్యాపారాలు లేకున్నా, ఎగువ తరగతికి చెందిన వారు మాత్రం కేవలం కొంత పరిథికి లోబడి గొలుసువ్యాపారానికి దిగి వీటికి గట్టిపోటీ ఇవ్వగలుగుతున్నారు. మరో పక్క జనం కూడా వివిధ కారణాల రీత్యా ఇటువంటి సంస్థల వైపే మొగ్గుచూపుతున్నారు.
మునుపు వినియోగదారుల అవసరాన్ని సొమ్ము చేసుకోవడం వ్యాపార లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు వినియోగదారులకు సౌకర్యాలను సమకూర్చడం ద్వారా లాభార్జన చేయడం వ్యాపారనీతిగా మారింది. సరుకులతో పాటు సౌకర్యాన్ని, సేవలతో పాటు సమయాన్ని అంద చేయడం ద్వారా వ్యాపారవృద్ధికి పలు సంస్థలు కృషిచేస్తున్నాయి. మొదట్లో వ్యాపారవృద్దికోసం ఒకే పట్టణంలో రెండు మూడు శాఖలను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడది పలు నగరాలకు, రాష్ట్రాలకు విస్తరించడం వల్ల అది చైన్ స్టోర్స్‌గా మారింది. వినియోగదారుల అవసరాన్ని సొమ్ముచేసుకోవడమే వ్యాపారం. సమాజంలో వస్తున్న సాంకేతిక మార్పులు జన జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది.
మొదట దుకాణాలకే పరిమితమైన వస్తువులు ఇప్పుడు వీధుల్లోకి వచ్చాయి. గతంలో వీధుల్లో అమ్మిన సరుకులు ఇప్పుడు పెద్ద పెద్ద దుకాణాలలో దర్శనమిస్తున్నాయి. తక్కువ మార్జిన్లు వేసుకుని అమ్మినా ఎక్కువ టర్నోవర్ ద్వారా మునుపటివలె లాభాలు ఆర్జించేందుకు వ్యాపారులు ఇష్టపడుతున్నారు. ఇది కేవలం సరుకుల దుకాణాలకే పరిమితం కాలేదు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు మీ అవసరాలకు సౌకర్యాన్ని జోడించి సేవలందించే సంస్థలు చాలా వెలిశాయి. అలా తమ శాఖలను పెంచుకుంటూ పోతున్న సంస్థలు అనకాపల్లి నుంచి ఆమెరికా దాకా, చిదంబరం నుంచి షికాగో దాకా తమ శాఖలను తెరుస్తున్నాయి. ఆ శాఖలనే చైన్ స్టోర్స్ అంటున్నారు. పచ్చళ్ల నుంచి పత్రికల దాకా, వస్త్రాల నుంచి చెప్పుల దాకా ఇప్పుడు అన్నిరకాల చెయిన్ స్టోర్స్ ఏర్పాటవుతున్నాయి. ఇది అది కాకుండా ఏ వస్తువునైనా అమ్మే స్టోర్స్, పలురకాల సేవలందించే సంస్థలు వెలుస్తున్నాయి. వౌలికంగా చూస్తే ఒకే బ్రాండ్‌తో కేంద్రీకృత యాజమాన్యంలో సరుకుల రిటైల్ అమ్మకాలు జరిపే అవుట్‌లెట్ల సముదాయాన్ని చైన్ స్టోర్స్ అంటారు. ఇది సరకులమ్మే దుకాణాలకే కాదు చైన్ రెస్టారెంట్లు, కొన్ని ప్రత్యేక సేవలు అందించే సంస్థల వ్యాపారాలకూ వర్తిస్తుంది.
సొంతంగా తమ శాఖను తెరవనప్పుడు అనుబంధంగా ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసినా అవి చైన్ స్టోర్స్ అవుతాయి. ఆయా కంపెనీల ఉత్పత్తుల ప్రాతిపదికగా వివిధ రకాల చెయిన్ స్టోర్స్ ఉంటాయి. ఓ వ్యాపార చెయిన్ వివిధ చోట్ల ఉన్న వ్యాపార సంస్థల సమాహారం. ఒకే బ్రాండ్‌తో ఆ సంస్థ నిర్వహించే స్టోర్స్ అన్నింటిలో ఒకే విధమైన సేవలు, ఉత్పత్తులు, ధరలు ఉంటాయి. పంపిణీ వ్యవస్థ, సిబ్బంది శిక్షణ, యాజమాన్యం కేంద్రీకృతమై ఉంటాయి. అన్ని స్టోర్స్ ఒకే కంపెనీ పర్యవేక్షణలోగాని, ఫ్రాంచైజీలుగా గాని ఉండవచ్చు. రెండు రకాల స్టోర్స్ కోసం ఒకేచోట కొనుగోళ్లు చేసి సరఫరా చేయడం జరుగుతుంది. సెంట్రలైజ్డ్ మార్కెటింగ్, కొనుగోళ్లు ఈ సంస్థల ప్రత్యేకత. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయడం వల్ల తక్కువ ధరకు సరుకులు వస్తాయి. తక్కువ వ్యయం. ఎక్కువ లాభం.
భారత్‌లో చైన్ స్టోర్స్ ఏర్పాటు కేవలం సరకుల వ్యాపారానికే పరిమితం కాలేదు. వివిధరకాల వస్తువులు కొంటుంటాం. పలురకాల సేవలను పొందుతుంటాం. మనిషికి కావలసిన కూడు, గూడు, నీడ వంటి కనీస అవసరాలకు తోడు ఇప్పుడు విద్య, వినోదం, రవాణా వంటివి కూడా అత్యవసరాలుగా మారుతున్నాయి. పుస్తకాల దుకాణాలు, బస్సు సర్వీసులు, విద్యా సంస్థలు కూడా చైన్లను నిర్వహిస్తున్నాయ. వస్త్రాల దుకాణాలలో బాంబే డయింగ్, రేమండ్స్, విమల్, దిగ్జమ్, రీడ్ అండ్ టేలర్ కంపెనీల చైన్ స్టోర్స్‌కు తోడుగా స్థానికంగా కొన్ని చైన్ స్టోర్స్ ఏర్పాటవుతున్నాయ. వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణానికి బస్సు సర్వీసుల ద్వారా సేవలు అందించే సంస్థలు వెలిశాయ. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల వారి వ్యాపారం దినదిన ప్రవర్థమానమవుతోంది.
చరిత్ర
ప్రపంచంలో మొట్టమొదటి చైన్ స్టోర్స్ లండన్‌లో డబ్ల్యు.హెచ్.స్మిత్ పేరిట ఏర్పాటైంది. 1792లో హన్రీ వాల్టన్ స్మిత్ తన భార్యతో కలసి ఈ స్టోర్స్‌ను ఏర్పాటు చేశారు. పుస్తకాలు, స్టేషనరీ, పత్రికలు, వార్తాపత్రికలు, వినోద ఉత్పత్తులకు ఆ స్టోర్స్ ప్రసిద్ధిచెందింది. అమెరికాలో చెయిన్ స్టోర్స్ శకం 1859లో దిగ్రేట్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ టీ కంపెనీ (ఎ అండ్ పి)తో మొదలైంది. 1920నాటికి అమెరికాలో మూడు జాతీయ స్థాయి చైన్ స్టోర్స్ -- ఎ అండ్ పి, వూల్‌వర్త్స్, యునైటెడ్ సిగార్ స్టోర్స్-- వెలిశాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే 2004 నాటికి వాల్‌మార్ట్ అతిపెద్ద రిటైల్ చెయిన్‌గా అవతరించింది.
చైన్ స్టోర్స్ వల్ల లాభనష్టాలు
పట్టణాలు, నగరాల్లో అన్ని చోట్లా చైన్ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ఉండడంతో చిల్లర దుకాణాలు పెద్ద ఔట్‌లెట్లతో పోటీ పడలేకపోతున్నాయని కొంతమంది వాపోతున్నారు. అయితే ఒక విధంగా ఈ చైన్ స్టోర్స్ వివిధ రకాల ఉత్పత్తులు సేవలను, ఉపాధి అవకాశాలను, తక్కువ ధరలను అందించడం ద్వారా స్థానికులకు లాభదాయకంగా ఉంటున్నాయి.
సమకాలీన సమాజానికి చైన్ స్టోర్స్ కనీవినీ ఎరుగని రీతిలో సదుపాయంగా ఉంటున్నాయి. అవి నిలకడగా ఒకే స్థాయి వ్యాపారాన్ని కొనసాగిస్తాయి. ఒక ప్రాంతంలో ఉండే ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణంలో వేరే ప్రాంతంలో ఉండే దుకాణంలో ఉండే అన్ని వస్తువులూ ఉంటాయి. ఫలితంగా ఆ దుకాణం అందరి గుర్తింపును పొందడమే కాకుండా ఆధారపడేలా కూడా చేస్తుంది. పెద్ద చైన్ స్టోర్స్‌లో ఒకే చోట అనేక వస్తువులు ఉండడం వల్ల జనానికి అవసరమైన అన్ని వస్తువులకు ప్రధాన దుకాణంగా మారుతుంటుంది. ఉదాహరణకు ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ చెయిన్‌లో అన్నిచోట్ల ఎంపిక చేసిన బ్రాండ్ల వస్తువులు అమ్మకానికి లభ్యమవుతాయి. అదే పెద్ద చెయిన్ స్టోర్స్‌లో ప్రాథమిక అవసరాలను తీర్చే అన్నిరకాల వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా చెయిన్ స్టోర్స్‌కు ఉన్న సదుపాయం ఏమిటంటే కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేయడంవల్ల, ఎక్కువ మంది
వినియోగదారులు స్టోర్స్‌ను సందర్శించడం వల్ల స్టోర్‌లో ప్రదర్శించే ప్రకటనల వల్ల వాటికి ప్రచారం లభిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు కూడా చెయిన్ స్టోర్స్ ద్వారా ప్రచారం కల్పించడం వల్ల వాటి మార్కెట్ పెరిగి ఎక్కువమంది కొనేందుకు దోహదమవుతుంది. ఈ కంపెనీలు వివిధ స్టోర్స్ మధ్య పెట్టే పోటీల వల్ల వారు ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకునేందుకు చూస్తారు. అప్పుడు కూడా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
చైన్ స్టోర్స్‌ను వినియోగదారుడి ఆధారిత పెట్టుబడిదారీ సమాజానికి ప్రతినిధిగా చెప్పవచ్చు. సామాజిక హోదాను నిర్ణయించే ఉత్పత్తులను చైన్‌స్టోర్స్ నిల్వ చేస్తాయి గనుకనే సాంస్కృతిక చిత్రాన్ని రూపుదిద్దే సామాజిక సంస్థలుగా వీటిని పేర్కొనవచ్చు. అందువల్ల వినియోగదారులకు అవసరమైన, కోరుకునే వస్తువులను అమ్మినప్పటికీ ఈ స్టోర్స్ వినియోగదారుడికి ఏది కావాలో, ఏమి కోరుకోవాలో కూడా చెప్తాయి. అయితే ఒకే స్థాయి వస్తువులు ఒకే చోట కేంద్రీకృతం కావడం సంస్కృతిని దెబ్బ తీస్తుందని కొందరు వాదించవచ్చు. ఉదాహరణకు చైన్ మ్యూజిక్ దుకాణాలు ఎక్కువగా పాపులర్ అయిన కళాకారుల పాడిన పాటల రికార్డులు, సిడిలు లాంటివాటినే స్టాక్ చేస్తూ, వారికన్నా తక్కువ ప్రజాదరణ పొందిన సాధారణంగా ఔత్సాహిక కళాకారుల పాటలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. అంతేకాక సొంత వ్యాపారాల ద్వారా ఒకరి చేతినుంచి మరొకరి చేతికి మారే సంపదను చైన్ స్టోర్స్ దోచేస్తున్నాయని, అందువల్ల ఆర్థికంగా ఇవి ప్రమాదకరమైనవని కూడా విమర్శకులు ఆరోపిస్తుంటారు.
స్థానిక దుకాణాల యజమానులు ఒకవేళ తాము ఇప్పుడున్న వస్తువులను మార్చినప్పటికీ ఒక చిన్న పట్టణంలో చైన్‌స్టోర్స్‌కన్నా ఎక్కువ ఉపయోగకరంగా ఉండవచ్చు. ఎందుకంటే స్థానిక యజమానులు స్థానిక వ్యవహారాల్లో ఎక్కువగా మమేకం అవుతూ ఉండడమే కాకుండా స్థానికంగా తమ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. చైన్ స్టోర్స్ సమాజ స్వరూపాన్ని మార్చివేస్తున్నాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలహీనం చేస్తున్నాయని విమర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆయా ప్రాంతాల్లో స్థానికులే సొంతంగా నిర్వహించే చిన్న చిన్న దుకాణాలు ఉండేవి. అయితే ఇప్పుడు ఈ దుకాణాల స్థానంలో పెద్ద పెద్ద మాల్స్, ఫ్రాంచైజీలు వచ్చేసాయి. స్థానిక రాజకీయ వేత్తలకు పన్ను ఆదాయాన్ని అందించే జాతీయ స్థాయి చైన్‌స్టోర్స్‌కు పన్ను రాయితీలు, అభివృద్ధి రాయితీలు తరచూ ఇస్తున్నారు. ప్రధాన చైన్స్ లక్ష్యమల్లా కూడా స్థానికంగా ఉండే వ్యాపారాలను పక్కకు నెట్టి వాటి కస్టమర్లను, రాబడులను లాగేసుకోవాలన్నదే. ఆదాయం కోసం చైన్‌స్టోర్స్ చేసే ఆలోచనలన్నీ కూడా లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. వినియోగదారులు ఇతర దుకాణాల్లో ఖర్చు చేసే సొమ్మునంతా ఇవి లాగేసుకుంటున్నాయి. అయితే పోటీ లేకపోవడం వల్ల పెద్ద దుకాణాలు అసమర్థంగా మారిపోయి కొన్ని సంవత్సరాలకే జాతీయ స్థాయిలో నిర్దేశించిన స్టాండర్డ్స్‌కు చేరుకోలేక పోతాయి. అప్పుడు ఆ స్టోర్ మూతపడిపోయి భవనం ఖాళీగా ఉంటుంది. దీంతో మరో కొత్త వ్యాపారం ఆ భవనంలోకి రావడానికి అవకాశం కల్పిస్తుంది.
స్వతంత్ర వ్యాపారాల స్థానంలో చైన్ స్టోర్స్ రావడం చాలా దేశాల్లో వివాదాలకు దారి తీసి ఈ చైన్ స్టోర్స్ పుట్టగొడుగుల్లాగా పుట్టుకురాకుండా నిరోధించడానికి స్వతంత్ర వ్యాపారులు సంఘటితం అయ్యేలా కూడా చేస్తున్నాయి. అమెరికన్ పుస్తక వ్యాపారుల అసోసియేషన్, అమెరికా స్వతంత్ర రెస్టారెంట్ల మండలి లాంటి జాతీయ స్థాయి వాణిజ్య గ్రూపులలోను, స్వతంత్ర వ్యాపార సంఘటన లాంటి ప్రాంతీయ ఆధారిత కూటములలోను ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశాల్లో జాతీయ స్థాయి సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నాయి. స్వతంత్రంగా ప్రాంచైజీలు లేకుండా ప్రారంభించే వ్యాపారాలే ఫ్రాంచైజీ వ్యాపారాలకన్నా కూడా ఎక్కువ విజయవంతమయ్యే అవకాశాలున్నాయి అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. ఎక్కువగా ఫ్రాంచైజీ వ్యాపారాలు వచ్చినప్పటికీ చిన్న వ్యాపారాలు కూడా వినియోగదారులకు అవసరమే అవుతాయి.
చిన్నపాటి స్వతంత్ర వ్యాపారం కన్నా పెద్ద పెద్ద చైన్‌స్టోర్స్ ఎక్కువ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాయి. కేవలం ఒకే రకమైన ఉత్పత్తులకు పరిమితం కాకుండా అవి అనేక రకాల బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయిస్తాయి. ఒకే చోట తక్కువ ధరకు ఎక్కువ రకాలను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి ఇది ఓ మంచి మార్గం. చైన్‌స్టోర్స్‌ను సమాజంలోని కొంతమంది స్వాగతిస్తున్నారు. ఎందుకంటే అవి చిన్న దుకాణాల ఉద్యోగులను తీసుకుని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో వీటిని చిన్న దుకాణాల యజమానులు కూడా స్వాగతిస్తుంటారు. ఎందుకంటే పోటీ లేకుండా చేసుకోవడం కోసం ఆ చైన్‌స్టోర్స్ చిన్న దుకాణాలకు భారీ ధర చెల్లించి కొంటుంటాయ.
ఓన్లీ విమల్
బాంబే డయింగ్, రేమండ్స్ రిటైల్ స్టోర్స్‌తో నిండిన మార్కెట్‌లో ధీరూబాయ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ గ్రూప్ 80వ దశకంలో 3ఓన్లీ విమల్2 స్టోర్స్‌ను ప్రారంభించి సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో 3ఓన్లీ విమల్2 స్టోర్స్ వెలిశాయి. కేవలం సంపన్నులకు మాత్రమే
పరిమితం కాకుండా అన్నివర్గాల వారికి అందుబాటులో ఉండే ధరల్లో మేలైన వస్త్రాలను అందించాలన్నది విమల్ వ్యాపారలక్ష్యం. దేశవ్యాప్తంగా 24 కంపెనీ స్టోర్స్‌కు తోడు 200 ఫ్రాంజైజీలున్నాయి. ఇప్పుడు రిలయెన్స్ గ్రూప్ కొత్తగా ప్రవేశపెట్టిన రిలయెన్స్ మార్ట్, రిలయెన్స్ ట్రెండ్స్‌లో కూడా విమల్ కలెక్షన్‌ను అమ్ముతున్నారు.
డబ్బావాలా
సేవల రంగంలో ప్రధానంగా చెప్పుకోవలసింది ముంబైకి చెందిన డబ్బావాలాలను. ముంబై నగర శివార్లలో ఉన్న నివాసప్రాంతాల నుంచి ఉద్యోగులు, కార్మికుల మధ్యాహ్న భోజనం క్యారేజీలు, బాక్స్‌లను సేకరించి ఆయా ఉద్యోగుల ఆఫీసులు, ఫ్యాక్టరీలకు వెళ్లి వాటిని అందజేయడం, తిరిగి ఖాళీ క్యారేజీలను వారి వారి ఇళ్ళలో ఇవ్వడం డబ్బావాలాల విధి. ఇది ముంబై నగరమంతటా విస్తరించి ఉన్న చెయిన్.
జనసాంద్రత ఎక్కువగా ఉన్న ముంబై మహానగరంలో ఆఫీసులకు, ఫ్యాక్టరీలకు వెళ్లాలంటే చాలా దూరం సబర్బన్ రైళ్ళలో ప్రయాణించవలసి ఉంటుంది. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లడానికి, హోటళ్ళలో భోజనం చేయడానికి బదులు చాలా మంది ఉద్యోగులు తమ ఇంటి నుంచి, కొన్నిసార్లు కేటరింగ్ వ్యాపారుల నుంచి డబ్బావాలాల చేత క్యారేజీలు తెప్పించుకుంటారు.

ప్రతి డబ్బామీద ఓ ప్రత్యేక గుర్తింపు, రంగు లేదా కోడ్ ఉంటుంది. దాని ఆధారంగా ఏ ప్రాంతానికి, ఏ ఫ్యాక్టరీకి, ఏ ఉద్యోగికి చెందిన క్యారేజీయో గుర్తిస్తారు. ఇళ్ళనుంచి సేకరించిన టిఫిన్ బాక్స్‌లను సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి నిర్ణీత స్టేషన్లకు వెళ్లే రైళ్ళలో పంపుతారు. అక్కడ దించుకుని ఆయా ఫ్యాక్టరీలలో ఉద్యోగులకు అందజేసేందుకు తీసుకువెళతారు.

డబ్బావాలా పరిశ్రమ ప్రతి సంవత్సరం 5-10శాతం పెరుగుతోంది. ఒక్కొక్క డబ్బావాలా సగటున నెలకు నాలుగైదు వేల రూపాయలు సంపాదిస్తాడు. ప్రతిరోజు దాదాపు రెండున్నర లక్షల టిఫిన్ బాక్స్‌లను నాలుగున్నర నుంచి ఐదువేల మంది డబ్బావాలాలు చేరవేస్తుంటారు. వీరిలో చాలా మంది నిరక్షరాస్యులైనప్పటికీ వారు అందజేసే అరవై లక్షల బాక్స్‌లలో ఒకటికి మించి తప్పులు జరగవని ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది.

ఇంతకాలం లోకల్‌రైళ్లు మినహా టెక్నాలజీ సేవలు వినియోగించుకోని డబ్బావాలాలు ఇప్పుడిప్పుడే మొబైల్ ఎస్‌ఎంఎస్ సదుపాయాన్ని వాడుకుంటున్నారు. 1880లో ఈ సేవలు ప్రారంభమైనప్పటికినీ 1890లో మహదేవ్ హవాజీ బచ్చే ఈ సేవను వ్యవస్థీకృతం చేసి మొదట వంద మందితో ఈ సేవను ప్రారంభించారు.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డబ్బావాలాలను గురించి బిబిసి ఓ డాక్యుమెంటరీని నిర్మించింది. ముంబై వచ్చినప్పుడు బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కూడా డబ్బావాలాలను కలుసుకున్నారు. ఇప్పుడు అనేక బిజినెస్ స్కూళ్లు డబ్బావాలాల ప్రతినిధులను తమ సంస్థలకు ఆహ్వానించి వారి విధులను గురించి తెలుసుకుంటుంటాయి.

బచ్‌పన్ స్కూల్స్
బాల్యం ఆటపాటలతో సాగాలి. అదే విధంగా చదువుకూడా. ఈ లక్ష్యంతో బచ్‌పన్ కార్పొరేట్ గ్రూప్ ఏర్పాటైంది. రెండేళ్ళ నుంచి ఐదేళ్ల మధ్య వయసుగల బాలలకోసం బచ్‌పన్ ప్లేస్కూల్స్‌ను ఈ సంస్థ ప్రారంభించింది. ఆ పాఠశాలలో బోధనాంశాలను సొంతంగా తయారుచేయడమే కాక తమ టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ఈ గ్రూప్ ప్రత్యేకత.
1995లో బచ్‌పన్ మొదటి ప్లే స్కూలు ప్రారంభం కాగా ఇప్పుడా సంఖ్య 600లను దాటింది. ప్రపంచ శ్రేణి వౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు , అంతర్జాతీయ ప్రమాణాలుగల బోధనా పద్ధతులను పాటించడం ద్వారా బాలలను ఉత్తమ విద్యార్థులుగా మాత్రమే కాక ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు, నియత విద్యాభ్యాసానికి సిద్ధంచేసేందుకు కృషిచేస్తున్నట్లు బచ్‌పన్ చెప్పుకుంటున్నది. దేశంలోనే పాఠశాలకు ముందు బోధన జరుపుతున్న ప్రీ స్కూల్స్‌లో బచ్‌పన్‌ను ఉత్తమమైందిగా భావించవచ్చు.

క్రాస్ వర్డ్
పుస్తకాలు అమ్మే దుకాణాల చైన్‌లో ప్రధానంగా క్రాస్‌వర్డ్‌ను పేర్కొనాలి. షాపర్స్ స్టాప్ లిమిటెడ్ చైన్ స్టోర్స్‌కు అనుబంధంగా ఉన్న క్రాస్‌వర్డ్ దేశంలోనే అతిపెద్ద బుక్‌స్టోర్ చైన్. దేశవ్యాప్తంగా క్రాస్‌వర్డ్‌కు ముంబ, బెంగళూరు, అహ్మదాబాద్, ఘజియాబాద్, పుణే, వడోదరా, కోల్‌కతా, చెన్నై, జైపూర్, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో మొత్తం 45స్టోర్స్ ఉన్నాయ.
1992లో క్రాస్‌వర్డ్ మొదటి స్టోర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి క్రాస్‌వర్డ్ అనేక పురస్కారాలను పొందింది. అతి పురాతనమైన బుక్ స్టోర్స్‌లో ఎ. హెచ్. వీలర్‌ను, హిగిన్ బాథమ్స్‌ను పేర్కొనాలి. వీలర్ బుక్ స్టోర్స్ దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలో ఉంటాయ. హిగిన్ బాథమ్స్ స్టోర్స్ అనేక నగరాలలో దర్శనమిస్తుంటాయి.

రెస్టారెంట్ చెయిన్
రెస్టారెంట్ చెయిన్ ఒకే విధమైన ఆహార పదార్థాలు, పానీయాలు, సేవలు అందించే రెస్టారెంట్ల బృందం. అన్నీ ఒకే యాజమాన్యం కింద గాని, వేర్వేరు యాజమాన్యాల కింద ఫ్రాంచైజీలుగా గాని ఉండవచ్చు. అన్ని రెస్టారెంట్లలో ఒకే ప్రామాణికమైన మెనూ, సర్వింగ్ పద్ధతులు ఉంటాయి. వీటిలో ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లను ప్రధానంగా పేర్కొనాలి. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే మెక్‌డోనాల్డ్, కెఎఫ్‌సి వంటివి రెస్టారెంట్ చెయిన్లు. మారియట్, రమడా హోటల్ చెయిన్లు ఉన్నాయి. కాగా మనదేశంలో ఇండియా హోటల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న తాజ్ గ్రూప్‌ను, ఐటిసి వారి వెల్‌కమ్ గ్రూప్‌ను పేర్కొనవచ్చు.

కేఫే కాఫీ డే
కాఫీ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా రకరకాల కాఫీలను అందిస్తున్న కాఫీ డే కేఫ్‌లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద కాఫీ వాణిజ్య సంస్థ అమాల్గమేటెడ్ బీన్ కాఫీ ట్రేడింగ్ కంపెనీలో కాఫీ డే భాగంగా ఉంది. దాదాపు 10వేల ఎకరాలలో కొండప్రాంతాలలో విస్తరించి ఉన్న కాఫీ తోటల నుంచి సేకరించిన కాఫీ గింజలతో తయారుచేసే కాఫీకి వినియోగదారుల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో 1996లో మొట్టమొదటి కేఫ్ ప్రారంభించారు. అలా మొదలైన కాఫీ డే ప్రయాణం ఆగకుండా సాగుతూ దేశంలో అతిపెద్ద రిటైల్ కాఫీ చైన్‌గా ఎదిగేలా చేసింది. ఇప్పుడు వియన్నా, కరాచీ, ప్రేగ్‌లలో కూడా కాఫీ డే కేఫ్‌లున్నాయి. కేఫ్‌ల చైన్లతో పాటు కాఫీ డే అమెరికా, ఐరోపా, జపాన్‌లకు కాఫీని ఎగుమతి చేస్తూ కాఫీ ఎగుమతిదార్లలో కూడా అగ్రస్థానానికి చేరుకుంది.

గడచిన కొన్ని సంవత్సరాలలో భారత్‌లో దైనందిన జీవనానికి అవసరమయ్యే సరుకులు, ఆహారపదార్థాలు, పళ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తులు అమ్మే చైన్ స్టోర్స్ సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో ఫుడ్‌వరల్డ్, స్పెన్సర్స్, రిలయెన్స్ ఫ్రెష్, హెరిటేజ్, మోర్ వంటి చైన్ స్టోర్స్ అవుట్‌లెట్లు నగరాలు, పట్టణాలు అనే తేడాలేకుండా అన్నిచోట్ల వెలుస్తున్నాయి.

త్రినేత్ర...మోర్
పాతిక సంవత్సరాల కిందట హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభమైన త్రినేత్ర సూపర్ మార్కెట్ అంచెలంచెలుగా ఎదిగి రాష్టవ్య్రాప్తంగా 100శాఖలకు విస్తరించింది. ఆ తరువాత త్రినేత్రను ఆదిత్య బిర్లా గ్రూపు తీసుకుంది. వివిధ రాష్ట్రాలలో పలు బ్రాండ్ నేమ్‌లతో ఉన్న స్టోర్స్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్ మోర్ పేరిట నామకరణం చేసింది. దక్షిణాదిలో ఆదిత్య బిర్లా గ్రూప్ 3మోర్2 సూపర్ మార్కెట్ల సంఖ్య 275కు పెరిగింది.

ఫుడ్‌వరల్డ్
దైనందిన జీవనానికి అవసరమయ్యే అనేక రకాల సరుకులు విక్రయిస్తున్న సూపర్‌మార్కెట్ల చైన్ ఫుడ్‌వరల్డ్. బెంగళూరు, హైదరాబాద్‌లలో ఫుడ్‌వరల్డ్‌కు అరవైకి పైగా స్టోర్స్ ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి హైపర్ మార్కెట్లు, సూపర్‌మార్కెట్లు, ఎక్స్‌ప్రెస్ స్టోర్స్ ఏర్పాటు ద్వారా తమ స్టోర్స్ సంఖ్యను 200కు పెంచుకోవాలని ఫుడ్‌వరల్డ్ భావిస్తోంది. డెరీఫామ్ ఇంటర్నేషనల్ గ్రూప్‌లో ఫుడ్‌వరల్డ్ ఒక అంగం. డెయిరీ ఫామ్ ఇంటర్నేషనల్‌కు దేశ విదేశాలలో 5300కు పైగా అవుట్‌లెట్లున్నాయి. ఎనభైవేలకు పైగా ఉద్యోగులున్న ఈ గ్రూప్ వార్షిక అమ్మకాలు 900కోట్ల డాలర్లను దాటాయి.

రిలయెన్స్ ఫ్రెష్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపార విభాగంలో రిలయెన్స్ ఒకటి. ఇదికాకుండా రిలయెన్స్ మార్ట్, రిలయెన్స్ డిజిటల్, రిలయెన్స్ ఫూట్‌ప్రింట్, రిలయెన్స్ ట్రెండ్జ్, రిలయెన్స్ వెల్‌నెస్, రిలయెన్స్ జివెల్స్, రిలయెన్స్ టైమ్‌అవుట్, రిలయెన్స్ సూపర్ కూడా ఉన్నాయి. ఇప్పటికే రిలయెన్స్ ఫ్రెష్ చైన్ అవుట్‌లెట్ల సంఖ్య 560 దాటింది. వచ్చే నాలుగేళ్ళలో రిటైల్ డివిజన్‌లో రూ.25వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని రిలయెన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. రిలయెన్స్ ఫ్రెష్ స్టోర్స్‌లో కూరగాయలు, పచారీ సరుకులు, తాజా పళ్లు, పళ్లరసాలు, చాక్‌లెట్లు, డెయిరీ ఉత్పత్తులు అమ్ముతారు. అయితే కొన్ని రాష్ట్రాలలో కూరగాయల వర్తకుల దాడుల కారణంగా ఆయా రాష్ట్రాలలో పళ్లు, కూరగాయల అమ్మకాలను తగ్గించాలని రిలయెన్స్ ఫ్రెష్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

బిగ్‌బజార్
‘ఇంతకన్నా చవకగా మరియు మంచిగా మరెక్కడా లేవు’ అనే నినాదంతో వ్యాపారం నిర్వహిస్తున్న బిగ్‌బజార్‌కు దేశవ్యాప్తంగా 133 స్టోర్స్ ఉన్నాయి. బిగ్‌బజార్ చైన్ ఫ్యూచర్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. ఆయా ప్రాంతాల పర్వదినాల సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే బిగ్‌బజార్ ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా మాంద్యం మాట ఎత్తకుండా కస్టమర్లకు మంచి మంచి డీల్స్‌ను ఆఫర్ చేయడంతో లక్షలాది మంది బిగ్‌బజార్ స్టోర్స్‌ను సందర్శించారు. స్థానిక పర్వదినాల సమయంలో తోలుబొమ్మలాటలు, శాస్ర్తియ సంగీత కచేరీలు, జానపద నృత్యప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల సరుకుల కొనుగోళ్లు చేయడంతో పాటు కస్టమర్లు వినోద కార్యక్రమాలను తిలకించే అవకాశాన్ని కూడా బిగ్‌బజార్ కల్పిస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌లో ఇంకా దుస్తులు అమ్మే చైన్ స్టోర్స్ పాంటలూన్స్, ఈ-జోన్ కూడా ఉన్నాయి.

No comments:

Post a Comment