Friday, December 9, 2011

సృజనకు అగ్ర తాంబూలం.. దృశ్య మాధ్యమం,

December 9th, 2011
తాము చదివిన డిగ్రీలు పూర్తవగానే తమ కెరీర్ ప్లానింగ్ పూర్తయి పోయిందని చాలామంది అభ్యర్థులు అపోహపడుతుంటారు. ఇష్టమున్నా లేకపోయినా కోర్సులు పూర్తిచేసి చేతులు దులుపుకోవడమనేది నేటి విద్యార్థులకు అలవాటైపోయింది. అయితే డిగ్రీలు పూర్తయిన అనంతరం ఏర్పడే ఉద్యోగ పోటీని తట్టుకోవడం నేడు చాలామంది విద్యార్థులకు దుస్సాధ్యమే అయిపోయింది. రిటెన్ టెస్టుల దగ్గరనుంచి ఇంటర్వ్యూల వరకు నెగ్గుకు రావడానికి నేడు విద్యార్థులు చాలా శ్రమించాల్సి వస్తుంది. అలా శ్రమపడ్డ వాళ్లలోకూడా కేవలం రెండు శాతంమంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు. దానితో వారు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ జీవితాన్ని అనుభవించాల్సి వస్తోంది. అయితే విద్యార్థులు కేవలం పుస్తకాలు, పరీక్షలు కాకుండా, సృజనాత్మకత వైపు దృష్టిపెట్టగలిగే అలాంటివారికి నేడు అమోఘమైన అవకాశాలున్నాయి. సృజనాత్మకత అనేది చదివితే వచ్చేది కాదని చాలామంది అంటున్నా విషయ పరిశీలన, ప్రసిద్ధ వ్యక్తుల గ్రంథాలు చదవడం, సమాజంలో చూసింది చూసినట్టు అంచనగా వేయడం, ప్రతి విషయాన్ని కొత్తగా చెప్పగలిగే నేర్పరితనం, స్క్రిప్టు రైటింగ్‌లో అవగాహన, భావ వ్యక్తీకరణ తదితర అంశాలను సాధన చేయగలిగితే అలాంటివారికి సృజనాత్మకమైన రంగంలో అమోఘ అవకాశాలున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా దినదిన ప్రవర్ధమాన మవుతున్న ప్రస్తుత తరుణంలో సృజనాత్మకశక్తి ఉన్న అభ్యర్థులకు పెద్ద పీటే లభిస్తోంది. న్యూస్, కరెంట్ అఫైర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్, డాక్యుమెంటరీలు, టాక్‌షోలు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, కార్టూన్ ఫీచర్లు తదితర పనులను సమర్ధవంతంగా చేయడానికి సృజనాత్మకత గల అభ్యర్థులు అవసరమవుతారు. అలాగే ప్రత్యేకమైన సృజనాత్మకత అర్హతలు, అభిరుచులు కలవారికి రీసెర్చ్ అసోసియేట్లు, స్క్రిప్టు రైటర్లు, మ్యూజిక్ డైరక్టర్లు, వాయిస్ స్పెషలిస్టులు, గ్రాఫిక్ డిజైనర్లు, ఎడిటర్లు, డైరక్టర్లు, యాంకర్లు, సౌండ్ స్పెషలిస్టు తదితర ఉద్యోగాలుకూడా అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా నేడు విస్తృతంగా అభివృద్ధి చెందడంతో దానిని కొన్నివిధాలుగా విభజించారు. రిపోర్టింగ్, ఏంకరింగ్, ప్రొడక్షన్, పోస్ట్‌ప్రొడక్షన్ తదితరాలలో ఏ ఒక్క విభాగాన్ని సమర్ధవంతంగా నిర్వహించలేకపోయినా ఎలక్ట్రానిక్ మీడియా స్తంభించిపోతుంది. అందువల్ల ఆయా విభాగాలకు చెందిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు మెళకువలతో ఉండాల్సిన అవసరం ఉంది.
రిపోర్టింగ్: రిపోర్టింగ్ విభాగంలో పనిచేసే అభ్యర్థులకు ఇంగ్లీషు, హిందీ భాషలతోపాటు ఇతర భాషల్లో కూడా పట్టు ఉండడం అవసరం. చెప్పదలచుకున్న విషయాన్ని క్లుప్తంగా, సమగ్రంగా, అందంగా చెప్పగలగాలి. చాంతాడంత విషయాన్ని రెండే రెండు ముక్కల్లో అందరికీ చెప్పగలిగే సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు రిపోర్టింగ్‌లో పెంచుకోవాలి. ఇలా చేయగలిగిన వారికి ఈ విభాగంలో తిరుగుండదు. టెలివిజన్ రిపోర్టింగ్ చేసేవారికి కళ్లు,చెవులే కాదు అవసరమైతే కొత్త విషయాలను రిపోర్టింగ్ చేయడానికి ధైర్యం, చొరవ కావాలి. అందరూ చూసే దృష్టితో కాకుండా ఓ కొత్త కోణంలో ప్రతి విషయాన్ని కెమెరాలోకి బంధించగలిగే సామర్ధ్యమున్న అభ్యర్థులు మంచి రిపోర్టర్లుగా ఖ్యాతికెక్కుతారు. అలాగే ఈ విభాగంలో పనిచేసేవారికి విజువల్ సెన్స్ ఉండాలి. అంతేకాకుండా తామేం చెప్పదలచుకున్నారో అది ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
స్క్రిప్టింగ్: టెలివిజన్ కార్యక్రమాలకు స్క్రిప్టింగ్ చేయడం ఓ కళ. ప్రొడ్యూసర్ లేదా దర్శకుడు చేస్తున్న కార్యక్రమాలు అందంగా, ఆహ్లాదభరితంగా, కన్నులకింపుగా తయారవ్వాలంటే సమర్ధవంతులైన స్క్రిప్టు రైటర్లు ఉండాల్సిందే. టెలివిజన్ కార్యక్రమాలకు స్క్రిప్టు అందించే అభ్యర్థులు ప్రతిభావంతులు, సమర్ధులు అయినపుడే ఆయా కార్యక్రమాలకు ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఈ రంగంలో స్క్రిప్టు రైటర్లకు పదాలు, భాషమీద పట్టు ఉండడం తప్పనిసరి. ఏ విషయాన్ని ఎంతవరకు ఖచ్చితంగా చెప్పగలగాలి అనే విషయం స్క్రిప్టు రైటర్లకు తెలిసి ఉండాలి. ఇదిలావుంటే ఇక టెలివిజన్‌లలో ప్రసారమయ్యే సీరియళ్లకు మాటలు, కథలు రాసేవారికి కూడా ప్రత్యేక అర్హతలుండాలి. సినిమా వేరు, టీవీ వేరు కాబట్టి వాటి వ్యత్యాసం స్క్రిప్టు రైటర్లకి పూర్తిగా తెలుసుండాలి. టీవీ ఫిలింకుగాని, కార్యక్రమానికి గాని, సినిమాకు గానీ మొదటి హీరో స్క్రిప్టు రైటర్. కనుక ఈ విభాగంలో స్థిరపడాలనుకునేవారు తమ సృజనాత్మకత శక్తిని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి.
యాంకరింగ్: నిర్వాహకుడు రూపొందించిన కార్యక్రమాన్ని ప్రేక్షకుడి ముందుంచే సంధానకర్తగా యాంకర్ వ్యవహరిస్తాడు. కార్యక్రమం గురించి ప్రేక్షకుడికి తెలియజేసేది యాంకరే. యాంకరింగ్ విభాగంలో రాణించాలనుకునేవారికి కొన్ని ప్రత్యేకమైన అర్హతలుండాలి. ఆకర్షణీయమైన రూపం, చక్కని కంఠస్వరం ఉండాలి. వీటితోపాటు ఫిజిక్‌ని ఎప్పటికప్పుడు స్లిమ్‌గా ఉంచుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి.
ఎడిటింగ్: టెలివిజన్ రంగంలో గానీ, సినిమా రంగంలో గానీ అత్యంత కీలకమైన పాత్రను ఎడిటింగ్ విభాగం పోషిస్తుంది. కెమెరాలో షూట్ చేసిన కార్యక్రమాన్ని ఖచ్చితంగా దృశ్య వీక్షణంగా చేసే బాధ్యతలను దర్శకుడి పర్యవేక్షణలో ఈ విభాగం చేపడుతుంది. ఈ విభాగంలోనే కార్యక్రమానికి వాయిస్ ఓవర్‌ని సంగీతాన్ని జతచేస్తారు.
కెమెరా: ఈ విభాగం అత్యంత కీలకమైనది. తీయదలచుకున్న విషయాన్ని అందంగా, ఆకర్షణీయంగా తీయగలగాలి. ఈ విభాగంలో పని చేసేవారు నేరుగా కెమెరామన్లుగా ఉద్యోగాల్లో చేరేకంటే కెమెరా అసిస్టెంట్ స్థాయినుంచి ఉద్యోగం చేపడితే కెమెరా ద్వారా తీయదలుచుకున్న వాటిని దృశ్యకావ్యం చేయవచ్చు. అలాగే కెమెరామెన్లకు ఓర్పు, సహనం తప్పనిసరి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి వాతావరణంలోనైనా దర్శకుడి అభిరుచికి తగ్గట్టుగా అందంగా తీయగలిగే ఓర్పు ఉండాలి. దాంతోపాటు ‘లైటింగ్ సెన్స్’ అనేది తప్పనిసరి. లైటింగ్ సెన్స్ లేని కెమెరామెన్ ఒక సమర్ధుడైన కెమెరామెన్‌గా రాణించడం దుర్లభం. అందువల్ల దృశ్యాలను కన్నులవిందుగా చేయగలిగే పనిని కెమెరామెనే్ల చేపడతారు. కాబట్టి ఈ రంగంలో ఎదగాలనుకునే వారికి ఓర్పు, సహనంతోపాటు విజువల్ సెన్స్ తప్పనిసరని ముందుగానే గుర్తించాలి.
ఉద్యోగావకాశాలు
వివిధ ఇన్‌స్టిట్యూట్లు నిర్వహించే డిగ్రీ, డిప్లొమాలు పూర్తి చేసిన వారికి ట్రయినీ ప్రొఫెషనల్స్‌గా అద్భుతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అయితే ఆయా డిగ్రీలు ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ, ఆయా ఉద్యోగాలకు అర్హత మాత్రం ఇస్తాయి. అయినప్పటికీ సృజనాత్మకత శక్తి ఉన్న అభ్యర్థులకే పెద్ద పీట లభిస్తుంది. ట్రయినీ రిపోర్టర్లుగా చేరే అభ్యర్థులకు ప్రారంభ వేతనం 8వేల రూపాయలుంటుంది. ట్రయినీ అనంతరం సామర్ధ్యాన్ని బట్టి 15 వేల రూపాయలకు పైనే లభిస్తుంది. ఇదిలావుంటే ఇతర విభాగాల్లో అంటే స్క్రిప్టింగ్, యాంకరింగ్, ఎడిటింగ్, పోస్టు ప్రొడక్షన్ విభాగాలలో పనిచేసే వారికి ఖచ్చితమైన వేతనం ఉండదు. పై విభాగాలలో ఏ అభ్యర్థికైనా సామర్ధ్యం పైనే అతని వేతనం ఆధారపడి ఉంటుంది. అయినా కొన్ని సంస్థలలో ప్రొడక్షన్ అసిస్టెంట్లకు 6వేల నుంచి 12వేల రూపాయలవరకు వేతనం ఉంటుంది. ఎడిటర్‌గా చేరే అభ్యర్థులకు 6వేల నుంచి 25 వేల వరకు సామర్ధ్యాన్ని బట్టి ఉంటుంది. అలాగే ట్రైనీ గ్రాఫిక్ ఆర్టిస్టు ట్రైనింగ్ కాలంలో 6వేలనుంచి 8 వేల రూపాయల వరకు వేతనాన్ని పొందుతున్నారు. ఈ ఉద్యోగాలే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి చీఫ్ ఎడిటర్, చీఫ్ రిపోర్టర్, స్పెషల్ కరస్పాండెంట్, సబ్ ఎడిటర్లు, వాయిస్‌ఓవర్ ఆర్టిస్టులు, యానిమేటర్లు, ఆర్ట్ డైరక్టర్లు, సెట్ అసిస్టెంట్లు, లైట్ బాయ్‌లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్స్, మేకప్‌మెన్లు, కాస్ట్యూమ్ డిజైనర్లతోపాటు జనరల్ మేనేజర్ స్థాయినుంచి ఆఫీస్ బాయ్ వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఆయా ఉద్యోగాలకు అభ్యర్థుల సామర్ధ్యాన్ని బట్టి వేతనాలుంటాయి.
కోర్సులు ఆఫర్ చేస్తున్న సంస్థలు
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ సంస్థ జర్నలిజంలో పిజి డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి తొమ్మిది నెలలు. డిగ్రీ అర్హతగా కోర్సును ఆఫర్ చేస్తున్నారు. న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ రిసెర్చ్ సెంటర్ మాస్ కమ్యూనికేషన్‌లో ఎంఎ డిగ్రీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి రెండు సంవత్సరాలు. న్యూఢిల్లీలోని ‘అకాడమీ 18’ సంస్థ ప్రొడ్యూసర్స్/డైరక్టర్స్/ఎడిటింగ్/ కెమెరా/జర్నలిజంలో ఆరు నెలల కోర్సును ఆఫర్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థ ప్రోడక్షన్, డైరక్షన్, వీడియో ఎడిటింగ్, కెమెరా, టీవీ జర్నలిజం, ఏక్టింగ్‌లలో కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సుల కాల వ్యవధి మూడు నెలలు. అలాగే థర్డ్ ఛానెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో సంస్థ టీవీ, రేడియో, టీవీ జర్నలిజంలలో మూడునెలల సర్ట్ఫికెట్ కోర్సు ఆఫర్ చేస్తోంది.
కోర్సులు అందిస్తున్న ఇతర సంస్థలు
* ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-పూణె
* మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్-న్యూఢిల్లీ
* జెఎన్‌టియు- హైదరాబాద్
* సెంట్రల్ యూనివర్సిటీ- హైదరాబాద్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీతోపాటు అనేక విద్యా సంస్థలు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి.

No comments:

Post a Comment